బీజేపీని ఎదుర్కొనే దమ్ము టీఆర్ఎస్కు లేదు : బండి
బీజేపీని ఎదుర్కొనే దమ్ము టీఆర్ఎస్కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎక్కడా కూడా వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. ఈ రోజు బ్రేకింగ్, రేపు హెడ్ లైన్స్‌లో ఉండేందుకే టీఆర్ఎస్ ఎంపీలు ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారని అన్నారు. తెలంగాణ బిల్లు సమయంలో కాంగ్రెస్ పెప్పర్ స్ప్రే కొట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఓటింగ్ సందర్భంగా విజయశాంతి పాల్గొంటే కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. తెలంగాణ బిల్లు సమయంలో కేసీఆర్ హాజరు కాలేదనే అంశంపై తెలంగాణలో చర్చ జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. పన్నెండు వందల మంది బలిదానాలకు కారణం కాంగ్రెస్ అని ఆరోపించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ ఎప్పుడూ అనుకూలమే అని బండి పేర్కొన్నారు.













