నన్ను కొనేవాళ్లు ఈ భూమ్మీద పుట్టలే ….
తనను కొనేవారు ఈ భూమ్మీద పుట్టలేదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీ ఇచ్చిన డబ్బుతో మజ్లీస్ పార్టీ రాష్ట్రంలో పోటో చేస్తున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ స్పందించారు. మమత వ్యాఖ్యలు నిరాధారమైనవని ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన నేతలు బీజేపీలో చేరుతున్నారని, దీంతో పార్టీ ఫిరాయింపులపై ఆమె ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. బీహార్లో తమకు ఓటేసిన ఓటర్లను మమత అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ ముస్లింల ఓట్లను చీల్చడానికి హైదరాబాద్ నుంచి ఓ పార్టీని పట్టుకొస్తున్నారని, బీజేపీ ఇచ్చిన డబ్బుతో ఆ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని ఆరోపించారు. బీహార్లో జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శమన్నారు.
కాగా, ఆప్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఓవైసీ ప్రకటించారు. 2022లో ఉత్తరప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.













