సరికొత్తగా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక..!?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ముమ్మరం చేసింది. వరుస సమావేశాలతో నేతలంతా బిజీ అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకోసం అధిష్టానం ఇప్పటికే కొన్ని కమిటీలు ఏర్పాటు చేసింది. ఒక్కో కమిటీకి ఒక్కో బాధ్యతను కట్టబెట్టింది. అందులో భాగంగా స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాను సద్ధం చేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులతో కూడిన నివేదికను స్క్రీనింగ్ కమిటీ అధిష్టానానికి సిఫారసు చేయనుంది. అందులో ఎవరికి మెరుగైన అవకాశాలు ఉంటాయనేది చర్చించి తుది అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందే స్క్రీనింగ్ కమిటీ సమావేశమై ప్రక్రియ మొదలు పెట్టింది.
కాంగ్రెస్ పార్టీలో టికెట్లకోసం భారీ పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరికొన్ని చోట్ల అసలు అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉంది. ఇలాంటివాటన్నిటినీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. అభ్యర్థుల ఎంపికకోసం ఓ విధానాన్ని ఫాలో అవుతోంది కాంగ్రెస్ పార్టీ. పోటీ పడాలనుకునే వాళ్లంతే దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో దరఖాస్తుకు కొంత ఫీజు నిర్దేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు రూ.25వేలు, ఓసీ నేతలు రూ.50వేలు ఫీజు చెల్లించి దరఖాస్తు తీసుకోవాల్సి ఉంటుంది. తమ అర్హతలు, ప్రొఫైల్ తో ఆ దరఖాస్తును నింపి మళ్లీ స్క్రీనింగ్ కమిటీకి అందజేయాలి. రేపటి నుంచి అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. 25 లోపు అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్లో అభ్యర్థి వివరాలతో పాటు పలు అంశాలను కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు.. ఏఏ పార్టీలు మారారు.. కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఎప్పుడు బయటికి వెళ్లి.. మళ్లీ ఎప్పుడు పార్టీలో చేరారు.. లాంటి అనేక అంశాలను అప్లికేషన్ లో పేర్కొనాలి. అంతేకాక.. దరఖాస్తుతో పాటు ఒక ప్రమాణపత్రాన్ని కూడా జతపరచాల్సి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నేతలు వెంటనే పార్టీ మారిపోయారు. అలా మారబోమని ప్రమాణ పత్రాన్ని ఈసారి ముందుగానే తీసుకొంటోంది హైకమాండ్. కర్నాటకలో ఇదే తరహాలో అభ్యర్థులను ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ స్ట్రాటజీనే ఇక్కడ కూడా అమలు చేస్తోంది.
గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం పీసీసీపైనే ఆధారపడి ఉండేది. పీసీసీ కోర్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థులను హైకమాండ్ ఎంపక చేసేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురయ్యేవి. అందుకే అలాంటి వాటికి స్వస్తి పలికి స్క్రీనింగ్ కమిటీ సిఫారసుల మేరకు హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. సునీల్ కనుగోలు ఇప్పటికే హైకమాండ్ కు నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికలను అందించారు. వాటిని కూడా పరిశీలించిన తర్వాత తుది అభ్యర్థిని హైకమాండ్ ఎంపిక చేస్తుంది. టికెట్ దక్కని వారిని బుజ్జగించి దారికి తెచ్చుకోవాలని నిర్ణయించింది. మొత్తానికి మూడు నెలలు ముందుగానే కమిటీ సమావేశం కావడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉన్నట్టు అర్థమవుతోంది.













