తెలంగాణ సర్కార్‌కు సవాల్‌గా మారిన పేపర్ ల లీకేజీలు!
తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ కు గురై పెద్ద దుమారం రేపుతున్నాయి. తాజాగా ఇవాళ ప్రారంభమైన పదో తరగతి ప్రశ్నపత్రం కూడా నిమిషాల వ్యవధిలోనే బయటకు రావడం కలకలం రేపుతోంది. పేపర్ లీకేజీ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం బాధ్యులను సస్పెండ్ చేసింది. అయితే విపక్షాలు మాత్రం ఈ అంశంపై ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
తెలంగాణలో ఇవాల్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ తెలుగు పరీక్ష. ఉదయం 9.30కు పరీక్ష ప్రారంభమైంది. అయితే 9.37 నిమిషాలకు ప్రశ్నపత్రం తాండూరులోని ఒక వాట్సాప్ గ్రూపులో దర్శనమిచ్చింది. 11 గంటల సమయంలో ఎంఈఓకు ఈ సమాచారం తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు దీనిపై ఆరా తీసి స్థానిక గవర్నమెంట్ పాఠశాలలో ఇన్విజిలేటర్ గా పనిచేస్తున్న బందెప్ప అనే టీచర్ కారణమని గుర్తించారు. అతను గ్రూపులో పోస్ట్ చేసిన కాసేపటికే దాన్ని డిలీట్ చేసినా.. అప్పటికే ఆ గ్రూపులోని పలువురు ఆ పేపర్ ను ఫార్వార్డ్ చేశారు. ప్రశ్నపత్రాన్ని గ్రూపులో పోస్ట్ చేసిన బందెప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే సూపరింటెండెంట్, డిపార్డ్ మెంటల్ ఆఫీసర్ పై కూడా కేసులు పెట్టారు.
ప్రశ్నపత్రాల లీకేజ్ ఇటీవలికాలంలో పెద్ద దుమారం రేపుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీకి చెందిన పలు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. దీనిపై ఇప్పటికే సిట్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. దీని వెనుక పెద్దల హస్తముందని, పెద్ద ఎత్తున నగదు బదిలీ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దీనిపై విపక్షాలన్నీ కలిసి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సతమతమవుతోంది. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ ఇప్పటికే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పదో తరగతి ప్రశ్నపత్రం నిబంధనలకు విరుద్దంగా బయటకు రావడం ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. సంఘటన జరిగిన తర్వాత స్పందించడం వేరు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అయితే పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ బయటికొచ్చింది కాబట్టి విద్యార్థులకు తెలిసే అవకాశం లేదని, ఒకవేళ తెలిసినా పెద్ద ఉపయోగం ఉండదని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే పరీక్షకు ఆలస్యంగా ఎవరినీ అనుమతించరు. కాబట్టి దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖాధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విపక్షాలు మాత్రం ఇది ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం అని విమర్శిస్తున్నాయి.













