కేసీఆర్పై మోదీ కామెంట్స్… కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటోందా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు రోజురోజుకూ ఉధృతమవుతోంది. వచ్చేవారంలో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పార్టీలన్నీ తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు. దీన్ని బట్టి తెలంగాణ ఎన్నికలను బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మోదీ తన నిజామాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ తో తమకేమీ సంబంధం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు మోదీ. అయితే స్వయంగా మోదీయే బీజేపీ – బీఆర్ఎస్ మధ్య బంధాన్ని బయటపెట్టారని కాంగ్రెస్ చెప్తోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను కలిసి ఎన్డీయేలో చేరతామని ప్రతిపాదించినట్లు మోదీ వెల్లడించారు. అంతేకాక.. కేటీఆర్ ను సీఎం చేస్తానని.. సహకరించాలని కోరినట్లు చెప్పారు. అయితే కుటుంబ పార్టీలకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని.. ఎన్డీయే కూటమిలో అవినీతి పరులను చేర్చుకునేది లేదని స్పష్టం చేసినట్లు మోదీ తెలిపారు. అయితే మోదీ కామెంట్స్ ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కేటీఆర్ సీఎం కావడానికి మోదీ సహకారం అక్కర్లేదని తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రజలు, ఎమ్మెల్యేలు కోరుకుంటే సీఎం అయిపోవచ్చని స్పష్టం చేసింది. నిజామాబాద్ సాక్షిగా ప్రధాని మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని విమర్శించింది.
అయితే.. బీఆర్ఎస్ – బీజేపీ ఒక్కటేనని తాము ముందు నుంచి చెప్తున్నామని.. ఇప్పుడు మోదీ కూడా అదే చెప్పారని కాంగ్రెస్ చెప్తోంది. ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ కాళ్ళబేరానికి వెళ్లారని.. అయినా పైకి మాత్రం గాంభీర్యాలు పోతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తెరపైకి వాళ్లిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్టు కనిపించినా.. తెరవెనుక వాళ్లిద్దరూ ఒకటేననే విషయం మోదీ మాటల ద్వారా అర్థమైందని ఆయన వివరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఎవరేంటో అర్థం చేసుకోవాలని సూచించారు.
బీజేపీ – బీఆర్ఎస్ మధ్య ఏదో ఉందనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది. పైకి ఆ రెండు పార్టీల నేతలు విమర్శించుకుంటున్నా.. బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తొలగిపోయిన తర్వాత ఆ వేడి కూడా తగ్గింది. అయితే బీఆర్ఎస్ కు మేలు చేసేందుకే బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెట్టిందనే ప్రచారం ఉంది. ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయని హస్తం పార్టీ చెప్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ – బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శిస్తోంది. మొత్తానికి మోదీ కామెంట్స్ ను క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ట్రై చేస్తోంది.













