ఖమ్మంలో అడుగు పెట్టిన క్షణమే కేసీఆర్కు బీజేపీ షాక్..?
తెలంగాణలో తిరుగులేని పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటికే పేరు మార్చుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్.. రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆవిర్భావ సభను ఇంతవరకూ నిర్వహించలేదు. దేశం మొత్తం ఈ సభ గురించి చర్చించుకునేలా నిర్వహించాలనేది కేసీఆర్ ఆలోచన. ముందుగా ఈ సభను హైదరాబాద్ లేదా ఢిల్లీలో గ్రాండ్ గా నిర్వహిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఆవిర్భావ సభ వేదికను ఖమ్మంకు మార్చారు. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగబోతోంది. ఈ సభకు కేజ్రివాల్, భగవంత్ మన్, అఖిలేష్ యాదవ్ సహా పలువురు జాతీయ నేతలు హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
అయితే బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తోంది బీజేపీ. ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలంటే ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అధికారం దక్కనీయకుండా చేయాలనే ప్లాన్ తో బీజేపీ ఉంది. అందుకే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఇప్పటికే ఇతర పార్టీల్లోని అసంతృప్తులపై బీజేపీ కన్నేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను బీజేపీ బాగా వాడుకుంటోంది. పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కమలం గూటికి చేరిపోయారు. మరికొంతమంది కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారు. రేపోమాపో వాళ్లు కూడా కమలం కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు.. బీఆర్ఎస్ ను దెబ్బ తీయాలంటే ఆ పార్టీ నేతలను కూడా తమవైపు తిప్పుకోవాలనుకుంటోంది బీజేపీ. ఇప్పటికే కేసీఆర్ కు కుడిభుజంగా ఉన్న ఈటల రాజేందర్ ను పార్టీలోకి లాక్కొని కమలం జెండాపై గెలిచి సత్తా చాటింది. ఇదే ఉత్సాహంతో మునుగోడులో కూడా కమలం జెండా ఎగరేయాలని బావించినా అది కుదరలేదు. అయినా ఏమాత్రం వెనక్కు తగ్గని బీజేపీ.. బీఆర్ఎస్ లోని అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లూ అధికార పార్టీలో ఉన్నందున నోరు మెదపని పలువురు అసంతృప్తులు ఇప్పుడిప్పుడే వాయిస్ పెంచుతున్నారు. బీజేపీకి కావాల్సింది కూడా ఇదే. ఇలాంటి సమయం కోసమే బీజేపీ వెయిట్ చేస్తోంది. ఇప్పుడు అలాంటి సమయం వచ్చింది కాబట్టి స్పీడ్ పెంచింది.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద బలగం లేదనే ఆరోపణలున్నాయి. అయినా అక్కడే ఆవిర్భావ సభను నిర్వహించడం ద్వారా సత్తా చాటాలనుకుంటున్నారు కేసీఆర్. ఇక్కడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని.. పదవులు లేకుండా చాలా కాలం ఉండలేమని ఇటీవల పొంగులేటి చేసిన కామెంట్స్ హీట్ పెంచాయి. పొంగులేటి పార్టీ మారడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు కేసీఆర్. మరోవైపు తుమ్మల కూడా మంచి అదనుకోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీ ఆవిర్బావ సభను 18న ఖమ్మంలో నిర్వహించబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరడానికి ఇదే మంచి సమయం అని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆవిర్భావ సభ రోజు ఆదే జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని దెబ్బ కొట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఆరోజే పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అదే జరిగితే బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలినట్లే.!













