16న రాహుల్ పట్టాభిషేకం
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈ నెల 16న బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లాంఛనంగా పార్టీ అధ్యక్ష పగ్గాలను తన తనయుడు రాహుల్కు అప్పగించనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ ఒక్కరే నామినేషన్ వేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అయినప్పటికీ నామినేషన్ ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. దీంతో రాహుల్ ఎన్నికను అదేరోజు ఏఐసీసీ లాంఛనంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న సోనియా గాంధీ, ఇతర సీనియర్ నేతల సమక్షంలో పార్టీ అధ్యక్ష పదవి నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ను రాహుల్కు అందజేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆ రోజు మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో పార్టీ అధ్యక్ష పగ్గాలను రాహుల్ స్వీకరించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.













