రాష్ట్రపతి పదవి అలంకారప్రాయo ?
మనం అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని నడిపేది ప్రధానమంత్రి కనుక రాష్ట్రపతి పదవి అలంకారప్రాయమైందన్న అభిప్రాయం బలంగానే ఉన్నా- అనేక సందర్భాల్లో నిర్ణాయక పాత్ర నిర్వహించిన రాష్ట్రపతులూ లేకపోలేదు. ప్రధాని ప్రభుత్వాధినేత అయితే రాష్ట్రపతి దేశాధినేత. ఈ రెండు పదవుల్లో ఉన్నవారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను రాజ్యాంగంలో స్పష్టంగానే నిర్దేశించారు.
స్పష్టమైన విధివిధానాలు
రాజ్యాంగం రాష్ట్రపతికి కొన్ని నిర్దిష్ట బాధ్యతలు అప్పగించింది. ప్రధాన బాధ్యత రాజ్యాంగ పరిరక్షణ! కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం (ప్రధాని నియామకం) రెండో బాధ్యత. పార్లమెంటులో ఏదో ఒక రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పుడు ఈ బాధ్యత రాష్ట్రపతి సునాయాసంగా నిర్వర్తించగలరు. 1980ల తరవాత ఏ పక్షానికీ మెజారిటీ లేనప్పుడు మూడు దశాబ్దాలపాటు ప్రధానమంత్రిని నియమించేటప్పుడు రాష్ట్రపతులు విచక్షణాయుతంగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఈ విషయంలో ప్రశంసనీయమైన ఆనవాయితీలను నెలకొల్పిన రాష్ట్రపతులూ ఉన్నారు. కొత్త ఒరవడి పెట్టినవారూ ఉన్నారు. లోక్సభ మద్దతు ఉన్నవారినే ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమించాలన్నది రాజ్యాంగ నిర్దేశం. మనది రాజకీయ పార్టీలకు ప్రధానపాత్ర ఉన్న వ్యవస్థ కూడా. ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు బాధ్యత అప్పగించాలన్న విషయంలో రాష్ట్రపతి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ‘ఈ విషయంలో రాష్ట్రపతికి విచక్షణాధికారం ఇవ్వకుండా ఉండలేం’ అని రాజ్యాంగ నిర్ణాయక సభలోనే డాక్టర్ అంబేడ్కర్ స్పష్టీకరించారు. అనేక కీలక పదవులకు నియామకాలు చేసేదీ రాష్ట్రపతే! పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి సంతకం చేస్తే తప్ప చట్టాలు కావు. భారత రాష్ట్రపతికి కార్యనిర్వాహక, న్యాయపరమైన, శాసనపరమైన అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మినహా, రాష్ట్రపతి తన అధికారాలను స్వతంత్రంగా వినియోగించే అవకాశం లేదు. మంత్రివర్గ సలహా మేరకే నడుచుకోవాల్సి ఉంటుంది. 1967 దాకా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం కొనసాగినప్పుడు మంత్రివర్గ నిర్ణయం మేరకు రాష్ట్రపతి నడచుకోవాలన్న సూత్రం ఏ ఆటంకం లేకుండా కొనసాగాల్సింది. అప్పుడూ రాష్ట్రపతికి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. రాష్ట్రపతి అనేక విషయాల్లో ప్రభుత్వ సలహా మేరకు నడుచుకోవాలన్నది రాజ్యాంగ నిర్దేశం. కనుక ఆ పదవిలో ఉన్నవారు ‘రబ్బర్ స్టాంప్’ లాంటివారేనని, రాష్ట్రపతి పదవి అలంకారప్రాయమైందన్న అభిప్రాయం బలంగా ప్రచారంలో ఉండేది. దీనికి భిన్నంగా వ్యవహరించిన రాష్ట్రపతులూ ఉన్నారు.
రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ సునాయాసంగా విజయం సాధిస్తారనడంలో అనుమానం లేదు. కాంగ్రెస్ నిర్ణయించిన నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని కాదని ఇందిరాగాంధీ వీవీ గిరిని రాష్ట్రపతి పదవికి పోటీ పెట్టినప్పుడుతప్ప, రాష్ట్రపతి ఎన్నిక ఎన్నడూ వూహాతీతంగా లేదు. 30 ఏళ్ల తరవాత ప్రస్తుతం కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. కనుక రాష్ట్రపతి, ప్రభుత్వానికి అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం లేదని భావించవచ్చు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి ప్రధాని తీసుకునే నిర్ణయాలను రాష్ట్రపతి గుడ్డిగా ఆమోదిస్తారనుకోలేం. అందువల్ల రామ్నాథ్ కోవింద్ ఎలా వ్యవహరిస్తారన్న ఆసక్తి ప్రజల్లో ఉండటంలో ఆశ్చర్యం లేదు.













