ఆన్లైన్లోనే పాస్‌పోర్టు వెరిఫికేషన్!
పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు నేరుగా పోలీసు ఇంటికి వచ్చే రోజులు కనుమరుగైపోనున్నాయి. మరో ఏడాదిలో వ్యక్తిగత ఎంక్వైరీ అవసరం లేకుండా, ఒకే ఒక్క మౌస్ క్లిక్‌తోనే పనిపూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నేరాలు, నేరగాళ్ల ట్రాకింగ్ నెట్వర్క్, సిస్టమ్స్ ప్రాజెక్టు (సీసీటీఎన్ఎస్) ద్వారా దేశవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలోని క్రైమ్ రికార్డులను ఆన్లైన్లో అనుసంధానించడం ద్వారా ఆన్లైన్లోనే పాస్‌పోర్టు వెరిఫికేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు కింద రూపొందించిన డిజిటల్ పోలీస్ పోర్టల్‌ను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ పోర్టల్‌లో ఇప్పటికే దేశంలోని 15,398 పోలీసు స్టేషన్లకు గాను, 13,775 స్టేషన్ల పాత, ప్రస్తుత రికాన్డులను కేంద్రం అప్లోడ్ చేసింది. వచ్చే ఏడాది మార్చి కల్లా మిగిలిన వాటి పని కూడా పూర్తి చేయనుంది. ఆ తర్వాత కొద్ది కాలానికే సీసీటీఎన్‌ఎస్‌ను విదేశాంగ శాఖకు అనుసంధానించి, పాస్‌పోర్టు సేవలను సులభతరం చేయనున్నారు.













