లాక్డౌన్ సడలింపుపై సమావేశం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ నుంచి కేంద్రం మరికొన్ని రంగాలకు మినహాయింపునిచ్చిన నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో ఏడు ముఖ్య మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఏప్రిల్ 20 నుంచి లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరుణంలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై శుక్రవారం చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లాక్డౌన్ పాక్షికంగా ఎత్తివేసినా నిబంధనలు కఠినంగా చేయాల్సిందిగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ కార్యదర్శి హీరాలాల్ సమారియా, ఎమ్ఎస్ఎమ్ఈ కార్యదర్శి అరుణ్ పాండా, పట్టణాభివృద్ధి కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, గ్రామీణ అభివృద్ధి కార్యదర్శి రాజేశ్ భూషణ్, షిప్పింగ్ కార్యదర్శి గోపాల్ కృష్ణ, గనుల శాఖ కార్యదర్శి సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.













