గిన్నిస్ బుక్ లో భారత యువతి!
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కురులను కలిగి వున్న టీనేజర్‌గా గుజరాత్ కు చెందిన 16 ఏళ్ల యువతి నీలాన్షీ పటేల్ గిన్నిస్ రికార్డు ఎక్కింది. ఈమెకు 5.7 అడుగుల పొడవైన కురులున్నాయి. కురులపై ఉన్న ఇష్టంతో తన అరో ఏట నుంచే జుట్టు కత్తిరించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నానని చెబుతోంది నీలాన్షీ. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తాను ఓసారి హెయిర్ కట్ చేయించుకున్నానని, అప్పుడు తనకు చాలా ఇబ్బందిగా అనిపించడంతో అప్పటి నుంచి మళ్లీ అదే పని చేయలేదని చెప్పిన నీలాన్షీ ఇపుడు ప్రతిష్టాత్మక గిన్నిస్ రికార్డు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అంటోంది. కాగా, నీలాన్షి కురులను నిటారుగా కొలిస్తే 67 అంగులాల పొడవు తేలింది. తాను వారానికి ఒకసారి తలంటి స్నానం చేస్తానని, ఆ తరువాత జుట్టును అరబెట్టుకునేందుకు గంటన్నర సమయం పడుతుందని, దువ్వేందుకు మరో గంట సమయం పడుతుందని, తన తల్లి ఇచ్చే మద్దుతుతోనే ఇంత పొడవైన కురులున్నా సమస్యలు లేకుండా ఉన్నానని వెల్లడించింది.













