సీఎం జగన్ ను ఇకపై అలానే పిలుస్తా : వైఎస్ షర్మిల
తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్‌పై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో వివిధ అంశాలపై ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం బస్సులోనే మీడియాతో మాట్లాడుతూ సీఎంను తాను జగన్ రెడ్డి అంటే సుబ్బారెడ్డికి నచ్చడం లేదన్నారు. ఇకపై ఆయన్ను అన్న గారు అనే అంటానని వ్యాఖ్యానించారు. సుబ్బారెడ్డి గారూ మీ సవాల్‌ను స్వీకరిస్తున్నా. మీరు చేసిన అభివృద్ధిని చూపించండి. దానిని చూసేందుకు నేను సిద్ధం. తేదీ, సమయం మీరు చెప్పండి. లేదంటే నేను చెబుతా. అభివృద్ధి పరిశీలనకు మేధావులను కూడా పిలుద్దాం. నాతో పాటు మీడియా, ప్రతిపక్షాలు కూడా వస్తాయి. చేసిన అభివృద్ధి ఏంటో అందరికీ చూపించండి. మీరు చెప్పిన రాజధానులు ఎక్కడ? కడతామన్న పోలరం ప్రాజెక్టు ఎక్కడ? అని నిలదీశారు.













