ప్రజల వద్దకు జగన్ పార్టీ కూడా….!
వైఎస్సార్ సీపీ యాక్షన్ ప్లాన్
60 రోజుల్లో మూడు అంశాలతో పార్టీ కార్యక్రమాలు
‘అన్న వస్తున్నాడు’ పేరుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టబోయే పాదయాత్రకు ముందు 60 రోజుల్లో మూడు అంశాలతో పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. వైఎస్సార్ సీపీ రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశం సోమవారం రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో చర్చించిన అంశాలను ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. ఈ భేటికి 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారని తెలిపారు. మూడు ప్రధాన అంశాలతో ప్రజల దగ్గరకు వెళ్లబోతున్నట్టు ఆయన వివరించారు.
- నవరత్నాల సభలు
ఆగస్టు 11 నుంచి 29 వరకు నవరత్నాల సభలు నిర్వహిస్తామని ఉమ్మారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఇళ్లను పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు వెళ్లి కలవాల్సివుంటుందని తెలిపారు. నవరత్నాల హామీల ప్రాధాన్యం గురించి ప్రజలకు వివరించాలని, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఇంతకుముందు పార్టీ విడుదల చేసిన ప్రజాబ్యాలెట్ గురించి అడగాలని సూచించారు. కార్యక్రమం ఎంతకు వచ్చిందనే దానిపై బూత్‌స్థాయి కమిటీలను పిలిచి నియోజకవర్గ కన్వీనర్ విచారిస్తూ ఉండాలన్నారు.
- వైఎస్సార్ కుటుంబం
సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 2 వరకు వైఎస్సార్ కుటుంబం పేరుతో పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టనున్నట్టు ఉమ్మారెడ్డి తెలిపారు. ప్రజలను పార్టీలోకి వైఎస్సార్ కుటుంబంలోకి ఆహ్వానించి, సభ్యులుగా నమోదు చేసే విధంగా సంప్రందించాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు సూచించారు. సభ్యత్వం తీసుకునేందుకు మొగ్గుచూపే వారు పార్టీ ఫోన్ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే వారికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ వాయిస్‌తో మెసేజ్ వస్తుందని చెప్పారు. తర్వాత తమ పార్టీ కార్యకర్తలు వారిని సంప్రదించి వివరాలు నమోదు చేసుకుంటారని వెల్లడించారు. సభ్యత్వానికి ఎటువంటి రుసుము అనేది లేదని స్పష్టం చేశారు. దీంతో పాటు నవరత్నాల హామీ కరపత్రం ప్రతి ఇంటికి ఇవ్వడం, ప్రజా బ్యాలెట్ పేపర్ మరోసారి అభిప్రాయం తీసుకుంటారని చెప్పారు. అనుకూలంగా స్పందించించిన ఇంటికి ఒక స్టిక్కర్ అతికిస్తారని.. దీని ద్వారా తమకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారనేది తెలుస్తుందన్నారు. వ్యతిరేకంగా ఉన్నవారిని ఆకట్టుకునేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
- విజయశంఖారావం
ఈ కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి 25 వరకు జరుగుతుందని ఉమ్మారెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు పోలింగ్ బూత్ పరిధిలో సమావేశాలు పెట్టుకుని జగన్ పాదయాత్రపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అక్టోబర్ 26 లేదా 27 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుందని.. ఈలోపు పైమూడు కార్యక్రమాలు పూర్తి కావాలన్నారు. ఈ మూడు కార్యక్రమాలు బూత్ స్థాయిలో విజయవంతంగా జరిగేందుకు ప్రశాంత్ కిశోర్ బృందం సహకరిస్తుందని తెలిపారు. అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగించుకుని అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేస్తానని జగన్ చెప్పినట్టు వెల్లడించారు.













