Jagan: విజయవాడ జైలులో వంశీని పరామర్శించిన జగన్ మాస్ వార్నింగ్..
కిడ్నాప్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ (YCP ) నేత వల్లభనేని వంశీ మోహన్‌ను (Vallabhaneni Vamsi Mohan) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ (Jagan) పరామర్శించారు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖత్ సందర్భంగా జగన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పి, పార్టీ అన్నివిధాలా తోడుంటుందని భరోసా ఇచ్చారు. జగన్‌తో పాటు వంశీ భార్య పంకజశ్రీ, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ కూడా జైలు లోపలికి వెళ్లి వంశీని పరామర్శించారు.
ఈ ఘటనపై స్పందించిన జగన్, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు ప్రజలకు అన్యాయం చేస్తూ టీడీపీ నేతలకు సలామ్ కొడుతున్నారని ఆరోపించారు. పోలీసులు తమ టోపీపై ఉన్న సింహానికి మాత్రమే సెల్యూట్ చేయాలని, రాజకీయ నేతలకు వశం అవడం సరికాదని హెచ్చరించారు. రేపు తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే, ఇప్పుడు అన్యాయంగా వ్యవహరిస్తున్న అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు.
వంశీ అరెస్టును తప్పుబట్టిన జగన్, ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యగా అభిప్రాయపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినట్లు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నప్పటికీ, పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ దాడి ఘటనలో వంశీ ఎక్కడా లేరని, తొలుత ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో లేదని గుర్తు చేశారు. తర్వాత వంశీని 71వ నిందితుడిగా చేర్చారని తెలిపారు. ఘటన జరిగినప్పుడు వంశీ అక్కడే లేరని, కానీ పోలీసులు ముందస్తుగా ప్లాన్ చేసి వంశీపై నిందలు మోపారని ఆరోపించారు. సత్యవర్ధన్‌ను బలవంతంగా తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్నట్లు ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో కీలక విషయాన్ని బయటపెట్టనున్నట్లు వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఈ రోజు రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించి నిజాలు బయటపడతాయని, ఇది అత్యంత సంచలన విషయమని పేర్కొంది. ఇక వంశీతో జగన్ ములాఖత్‌కు సంబంధించి వైసీపీ నేతలు పేర్ని నాని, కొడాలి నానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. జగన్ ములాఖత్‌కు ఒకరోజు ముందే సమాచారం ఇచ్చినా, జైలు అధికారులు వారిని అనుమతించలేదు. అయితే, వంశీ భార్య పంకజశ్రీ, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. జగన్ జైలు వద్దకు చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు.













