చల్లా కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
కరోనాతో ఇటీవల మృతి చెందిన దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కర్నూలు జిల్లా అవుకులోని చల్లా స్వగృహానికి వెళ్లిన జగన్ రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కాగా, చల్లా రామకృష్ణారెడ్డి హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా సీఎం పర్యటలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, స్థానిక బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, పాణ్యం మాజీ శాసన సభ్యుడు బిజ్జం పార్థ సారధి రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేసింది. ఓర్వకల్లు విమానాశ్రయం, అవుకులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కె.ఫక్కీరప్ప తెలిపారు.













