పింగళి వెంకయ్య కుమార్తెను సన్మానించిన సీఎం జగన్
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాచర్లలో పర్యటించారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్కరించారు. వెంకయ్య కుటుంబసభ్యులు గుంటూరు జిల్లా మాచర్లలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాచర్లకు వెళ్లి వారిని సన్మానించారు. ముఖ్యమంత్రి జగన్ను చూసి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి జగన్తో కలిసి పంచుకున్నారు. ముఖ్యమంత్రి పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను ముఖ్యమంత్రి తిలకించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాదు ఒక ఆత్మీయుడిగా పలకరించారని పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి పలకరింపుతో వందేళ్ల ఆయుష్షు వచ్చిందన్నారు. జాతీయ జెండాను గాంధీకి స్వయంగా పింగళి వెంకయ్య అందించారని, తండ్రిగా పింగళి వెంకయ్య తనకు గాంధీకి పరిచయం చేశారని ఆమె ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు.













