ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తన జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును ఆయన కోశారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేసి జగన్కు ఆశీర్వచనం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం వద్ద యాత్ర ప్రారంభించిన విపక్ష నేత బృందావనం మీదుగా టెక్కలి మండలం రావివలస వరకు 3 కిలోమీటర్ల మేర పాదయాత్రను కొనసాగించారు. దారిలో యువకులు, మహిళల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సమయంలో రావావలసకు చేరుకున్న జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.













