తండ్రి అనుమతించిన వాటికి కొడుకు నోటీసులు పంపడమేమిటి?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కక్ష్య సాధింపే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణడు మండిపడ్డారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను నిర్మించినపుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు. ఒక వేళ అది అక్రమ కట్టడమైతే వైఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను అనాటి వైఎస్ ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇచ్చిందని అడిగారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఉన్న పార్టీని జగన్ నడుపుతున్నారని వైఎస్ బొమ్మను పెట్టుకుని పాలన చేస్తున్నారని ఈ నేపథ్యంలో తన తండ్రి ఇచ్చిన అనుమతులకు జగనే బాధ్యత వహించాలని అన్నారు. తండ్రి అనుమతులిచ్చిన భవనాలను కొడుకు నోటీసులు పంపడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ భవన నిర్మాణానికి 2008లో గ్రామ పంచాయతీ, 2012లో రివర్ కన్జర్వేటర్ అనుమతి ఇచ్చారని తెలిపారు. కూలగొట్టడం, దాడులు చేయడం, భయోత్సావం సృష్టించడమే జగన్ దినచర్య అని అన్నారు.













