ఇప్పుడు వారు కూడా అదేపని…యనమల
ప్రస్తుత ప్రభుత్వంలో రాజకీయ నియామకాలన్నీ రెడ్డి సామాజిక వర్గంతో నింపేస్తున్నారని శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పోరేషన్ల్లు, కమిటీలు అన్నింటిలోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరిగిన నియామకాలను చదివి వినిపించారు. గతంలో తమ ప్రభుత్వాన్ని విమర్శించి.. ఇప్పుడు వారు కూడా అదే పని చేస్తున్నారని అన్నారు.
బడ్జెట్ కు సంబంధించి సాగునీటి రంగానికి గతంలో కంటే మూడు వేల కోట్లు తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేశారని దుయ్యబట్టారు. బీసీ, ఎస్టీలకు నిధులు తగ్గాయని, యువజన సర్వీసులు, ఐటీ, పరిశ్రమల శాఖలకు భారీగా నిధుల కోత పడిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 6 పథకాలు రద్దు చేశారన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఈవీఎంలు శకుని పాత్ర పోషించాయని యనమల వ్యాఖ్యానించారు.













