అమరావతి చదువుతో అమెరికా అవకాశాలు
విట్-ఏపీ అమరావతి ప్రాంగణంలో 2018-19 విద్యా సంవత్సరంలో మూడేళ్ల బీబీఏ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఏడాది డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్-డియర్బార్న్ (యుఎం-డి)తో లెటర్ ఆఫ్ ఇండెంట్ ద్వారా ఒక అవగాహనకు వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహనతో అమరావతి విట్ వర్సిటీ ప్రాంగణంలో బీబీఏ చేసే విద్యార్థులు అమెరికా వెళ్లి చదువుకునే వీలు ఏర్పడింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలతో, పరిశోధనా సంస్థల సహకారంతో విట్ అమరావతి విశ్వవిద్యాలయ ప్రాంగణ విద్యార్థులకు విదేశీ చదువునకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఇక్కడ చదివి ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికాలో కొంతకాలం చదివే వీలు కల్పించి విట్ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఇక్కడ డిగ్రీ లేదా పీజీ చేసిన విద్యార్థులకు దేశ విదేశాల్లో ఎక్కడైనా ఉద్యోగాలు లభిస్తాయని విట్ వైస్ చాన్సెలర్ డాక్టర్ విశ్వనాథన్ తెలిపారు. విట్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ శేఖర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ప్లస్-2 లేదా ఇంటర్మీడియెట్ చదివిన విద్యార్థులు కూడా బీబీఏ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.













