Vallabhaneni Vamsi: రోజుకో మలుపు తిరుగుతున్న వల్లభనేని వంశీ కేస్..బెయిల్ దొరికేనా?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే ( Gannavaram Ex MLA) , వైసీపీ నేత వల్లభనేని వంశీపై ( Vallabhaneni Vamsi) వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కిడ్నాప్ కేసులో అరెస్టైన వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్ కోసం న్యాయవాదులు, వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా, వరుసగా కొత్త కేసులు నమోదవుతుండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. గతంలో టీడీపీ (TDP) నేత చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) , వైసీపీ లీడర్ నందిగామ సురేశ్ ( Nandigama Suresh) ఎదుర్కొన్న అనుభవమే ఇప్పుడు వంశీకి ఎదురవుతోందనే ప్రచారం జరుగుతోంది. చింతమనేని ప్రభాకర్ పై గత ప్రభుత్వ హయాంలో 12 కేసులు నమోదయ్యాయి. ఆయన 64 రోజుల పాటు జైల్లో గడిపారు. అదే విధంగా నందిగామ సురేశ్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయ్యారు. ఆ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే ఎస్సీ మహిళ హత్య కేసును ఉద్దేశించి మరో కేసు నమోదు చేయడంతో 150 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు వంశీ పరిస్థితీ దాదాపుగా ఇదే విధంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.
వంశీపై గతంలో 16 కేసులు పెండింగ్లో ఉండగా, ఇటీవల మరిన్ని కేసులు నమోదయ్యాయి. మంత్రి లోకేశ్ రెడ్ బుక్ లో పేరున్న కారణంగా ఆయనపై మరిన్ని కేసులు రావచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గతంలో ఆయన అనుసరించిన వైఖరి, టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని చెబుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించినా, అదే సమయంలో టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్థన్పై దాడి, కుల వివక్ష వ్యాఖ్యల కేసు నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే సత్యవర్థన్ కిడ్నాప్ వ్యవహారంలో ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఫిర్యాదు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేశారన్న ఆరోపణలతో వంశీపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే కొనసాగుతున్నారు.
వైసీపీ అగ్రనాయకత్వం వంశీకి బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ, వంశీకి బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, టీడీపీ నేతలపై వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, సామాజిక మాధ్యమాల్లో దూషణల కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బోరుగడ్డ అనిల్, శ్రీ రెడ్డి వంటి వైసీపీ అనుకూల వ్యక్తులపైనా కేసులు నమోదయ్యాయి. ఇదే తరహాలో వంశీపై కూడా కేసులు నమోదవుతున్నాయి.
ప్రస్తుతం వంశీపై భూ ఆక్రమణలు, బెదిరింపులు, దాడి వంటి వివిధ ఆరోపణలతో కేసులు పెరుగుతున్నాయి. గన్నవరంతో పాటు విజయవాడ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిణామాలు వైసీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, వంశీని బెయిల్ పై విడుదల చేయించేందుకు ఆయన సతీమణి పంకజశ్రీతో పాటు వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.ఈ నేపథ్యంలో వంశీ కేస్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..













