Gannavaram: గన్నవరంలో టీడీపీకి షాక్ ఇచ్చిన వల్లభనేని వంశీ..! బిత్తరపోయిన టీడీపీ.!!
గన్నవరం (Gannavaram) అనగానే మనకు గుర్తొచ్చే పేరు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi). తెలుగుదేశం పార్టీలో (TDP) రాజకీయాలు మొదలు పెట్టిన వంశీ .. ఆ తర్వాత వైసీపీలో (YCP) చేరారు. ఇటీవలి ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ.. వైసీపీకి అనుబంధంగా పని చేసారు. ఆ సమయంలో భువనేశ్వరిపై (Nara Bhuvaneswari) ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టించాయి. వీటిని సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వంశీని ఎలాగైనా ఓడించాలనుకున్నారు. అలాగే ఓడించారు కూడా.! అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై (Gannavaram TDP Office) కొంతమంది వ్యక్తులు దాడులు చేశారు. దీనిపై కేసు నమోదైంది.
2022 ఫిబ్రవరిలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆఫీసుతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి చేసింది వైసీపీ వాళ్లేనంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే తమపైన కూడా టీడీపీ వాళ్లు దాడి చేశారంటూ వైసీపీ వాళ్లు కూడా కేసు పెట్టారు. అయితే ఈ కేసు ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసులో కదలిక మొదలైంది. ఈ దాడి వెనుక సూత్రదారి వల్లభనేని వంశీయేనంటూ ఫిర్యాదులు అందాయి. ఆ మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ కావాలంటూ వల్లభనేని వంశీ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఈ కేసులో వంశీ చిక్కుకుపోవడం ఖాయమని అందరూ భావించారు.
అయితే ఇక్కడే సరిగ్గా వల్లభనేని వంశీ చక్రం తిప్పారు. టీడీపీ కార్యాలయంపై దాడిపై అందులో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ (Mudunuri Sathyavardhan) అనే వ్యక్తితో కేసు నమోదు చేయించారు టీడీపీ నేతలు. ఇతను ఎస్సీ కావడంతో ఎస్సీ ఎస్టీ కేసు (SC ST Case) నమోదైంది. అయితే ఇప్పుడు ఆ ముదునూరి సత్యవర్ధన్ రివర్స్ అయ్యారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనను సాక్షిగా మాత్రమే అప్పుడు పోలీసులు సంతకాలు పెట్టించుకున్నారని, కేసు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. దీంతో టీడీపీ ఒక్కసారిగా ఖంగుతింది.
వల్లభనేని వంశీ ఎత్తుగడకు గన్నవరం టీడీపీ నేతలు బిత్తరపోయారు. కేసును సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే టీడీపీకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkat Rao), లీగల్ టీమ్ సరిగా డీల్ చేయలేదని అర్థమైంది. ఫిర్యాదుదారుడి పరిస్థితిని ఆరా తీయకపోవడం, అతడిని పట్టించుకోకపోవడం వల్లే ఇలంటి పరిస్థితి వచ్చిందని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి రివర్స్ కావడంతో ఈ కేసు వీగిపోయే పరిస్థితి ఏర్పడింది. వల్లభనేని వంశీని ఇరికించేందుకు ఇది సరైన మార్గమని భావించిన టీడీపీకి ఇది పెద్ద షాక్. మరోవైపు వైసీపీ శ్రేణులు ఈ పరిణామాలు చూసి సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని తీవ్ర అవమానంగా భావిస్తోంది టీడీపీ. ఇకపైన ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని టీడీపీ నేతలు సూచిస్తున్నారు.













