Visakha Sarada Peetham : విశాఖ శారదా పీఠానికి షాక్..! టీటీడీ నోటీసులు..!!
తిరుమలలో ((Tirumala) విశాఖ శారదా పీఠానికి (Vishaka Sharada Peetham) గట్టి ఎదురు తెబ్బ తగిలింది. తిరుమలలో శారదా పీఠాన్ని ఖాళీ చేయాలని టీటీడీ (TTD) నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నుంచి భూములు పొందడమే కాక, నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో కట్టడాలు కట్టేరనే ఆరోపణలు రావడంతో శారద పీఠంపై టీటీడీ చర్యలకు సీద్ధమైంది. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర (Swaroopanandendra) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. ఆయన పీఠాధిపతిగా కాకుండా వైసీపీ కార్యకర్తలా వ్యవహరించేవారని టీడీపీ నేతలు విమర్శించేవారు. ఇవన్నీ ఇప్పుడు శారదా పీఠం మెడకు చుట్టుకుంటున్నాయి.
విశాఖ శారదా పీఠం, ఆది శంకరాచార్యులచే స్థాపించబడిన శృంగేరి శారదా పీఠానికి (Sringeri Sarada Peetham) అనుబంధంగా పని చేస్తుంటుంది. 1980లలోనే తిరుమలలో టీటీడీ నుంచి భూమి లీజుకు తీసుకుని స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. శారదా పీఠానికి టీటీడీ 5వేల చదరపు అడుగుల భూమి కేటాయించింది. అయితే దానికి అదనంగా 2,150 చదరపు అడుగుల భూమిని శారదా పీఠం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగు అంతస్తులకు బదులు ఆరు అంతస్తులుగా నిర్మించినట్లు తెలుస్తోంది. సమీపంలోని నీటి ప్రవాహాన్ని మళ్లించడం, చెట్లను నరికివేయడం వంటి చర్యలు తిరుమల పర్యావరణ పవిత్రతను దెబ్బతీశాయని కొందరు స్వామీజీలు ఆరోపిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి వంటి సంస్థలు ఈ అక్రమాలను ఎత్తిచూపుతూ కోర్టులో కేసులు దాఖలు చేశాయి. 2024 నవంబర్లో, టీటీడీ శారద పీఠం లీజు ఒప్పందాన్ని రద్దు చేసి, భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇప్పుడీ భవనాన్ని 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పు ఆదేశాల మేరకే తాము నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చెప్తోంది.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేవారనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠాన్ని సందర్శించి, స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్ తన ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలకు స్వామి సలహాలు తీసుకున్నట్లు సమాచారం. 2020లో స్వరూపానందేంద్ర జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాల నుంచి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మెమో జారీ చేయడం వివాదాస్పదమైంది.
శారదా పీఠానికి భూములు రద్దు చేయడం వెనుక రాజకీయ కారణాలున్నాయని వైసీపీ విమర్శిస్తోంది. అయితే టీటీడీ చర్యలను హిందూ ధర్మ పరిరక్షణ సమితి సమర్థించింది. ఈ భూములను వెనక్కు తీసుకోవడం ద్వారా తిరుమల ఆధ్యాత్మిక సమగ్రతను టీటీడీ కాపాడుతుందని అభిప్రాయపడింది. మరి తాజా నోటీసులకు అనుగుణంగా శారదా పీఠం భూములను టీటీడీకి అప్పగిస్తుందా.. లేకుంటే కోర్టులను ఆశ్రయిస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది.













