టీడీపీ, జనసేన మధ్య సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చిందా..?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అందరి చూపూ తెలుగుదేశం, జనసేన పార్టీల వైపే ఉంది. ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఎలాగైనా జగన్ ను ఓడించాలనేది ఆ రెండు పార్టీల పట్టుదల. అందుకోసం రెండూ కలిసి పనిచేయాలని డిసైడయ్యాయి. అయితే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం అంత ఈజీ కాదు. వేటికవే ఎక్కువ సీట్లు కావాలని పట్టుబడతాయి. దీంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసి కొట్టడం ఖాయమని అధికార వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ఆ రెండు పార్టీలను ఎలాగైనా విడగొట్టాలని తెగ ప్రయత్నిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టు సమాచారం.
ఏపీలో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతోంది. అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంది. ఇప్పటికే ఐదు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. నియోజక వర్గ ఇన్చార్జ్ ల పేరిట జాబితాలు విడుదల చేస్తోంది. వీళ్లే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రాంతాల వారీగా సభలు చేపడుతూ జోష్ పెంచుతోంది. ఎన్నికలకు సిద్ధం అని సవాల్ విసురుతోంది. మరోవైపు టీడీపీ, జనసేన మధ్య పొత్తును వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో టీడీపీ కంటే జనసేననే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది.
అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కలిసే ఎన్నికలకు వెళ్తామని ఆ రెండు పార్టీలు గట్టిగా డిసైడయ్యాయి. ఈ మధ్య చంద్రబాబు రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగానే పవన్ కల్యాణ్ కూడా తాము ఈ రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నామంటూ ప్రకటించారు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనుకున్నారు. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. కచ్చితంగా రెండు పార్టీలూ కలిసే వెళ్తాయని పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రెండు పార్టీల కేడర్ కు ఒక క్లారిటీ వచ్చింది. అయితే సీట్ల పంపకాలపై వీలైనంత త్వరగా ఒక అవగాహనకు రావాలని రెండు పార్టీలూ నిర్ణయించుకున్నాయి.
తమతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుందేమోనని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అందుకే ఇంతకాలం సీట్ల పంపకాలపై ముందడుగు వేయలేదు. అయితే బీజేపీ వైపు నుంచి పెద్దగా సానుకూల వాతావరణం కనిపిస్తున్నట్టు లేదు. అందుకే ఇక ఆలస్యం చేయకూడదనే నిర్ణయానికి వచ్చాయి. ఈ వారంలోనే రెండు పార్టీల అధినేతలు కూర్చొని సీట్ల పంపకాలపై క్లారికీ రానున్నట్టు తెలుస్తోంది. దాదాపు 120 నుంచి 130 స్థానాలపై ఆ రెండు పార్టీలూ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. 20-28 అసెంబ్లీ సీట్లు, 3-4 లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల టీడీపీ బరిలో ఉండనుంది. ఇదే విషయాన్ని ఆ రెండు పార్టీల అధినేతలు ఈ వారంలో అధికారికంగా వెల్లడించనున్నట్టు సమాచారం.













