రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ మద్దతు.. వారికే
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తెలుగుదేశం పార్టీ తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. టీడీపీ వ్యూహ కమిటీలో చర్చించిన అనంతరం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయానికే కట్టుబడి ఉందన్నారు. గతంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలామ్లకు మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన ఆదివాసీ మహిళ ముర్మూకే తమ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.













