ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు
కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఉందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. కరోనా బాధిత కుటుంబాలు, కరోనా విజేతలు, వైద్యనిపుణులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫ్రంట్లైన్ వారియర్స్ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు దైర్యం చెప్పాల్సిన అవసరముందన్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్త జీవితానికి అలవాటు పడాలని వ్యాక్సిన్ వచ్చేవరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
కరోనా ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది జీవితాలు తారుమారయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పారు. కరోనా ప్రభావం ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై పడిందని, అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేతివృత్తులు, కులవృత్తులు, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలకు చాలా ఇబ్బందులున్నాయని చెప్పారు. అలాంటి ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందించాలని కోరారు. క్వారంటైన్లో ఉన్న రోగులకు రూ.2 వేలు ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్పిందని ఆ నగదును ఇవ్వాలని సూచించారు.













