భారీగా ప్రజాగళం సభ.. ముగ్గురు ఒకే వేదికపై..
ఆంధ్ర లో త్వరలో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి హడావిడి మొదలు కాబోతోంది. కూటమిగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన.. సంయుక్తంగా నిర్వహించబోయే తొలి సభకు శ్రీకారం చుట్టారు. ఈ సభకు ‘ప్రజాగళం’ అని నామకరణం కూడా చేశారు. ఈనెల 17 న సాయంత్రం నాలుగు గంటలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం బొప్పూడి వేదికగా ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి నారా లోకేష్ భూమి పూజ కూడా నిర్వహించారు. తాజాగా ఈ సభకు సంబంధించి పోస్టర్, లోగోను విడుదల చేశారు. లక్షలాది మంది తరలి వస్తారు అని అంచనా వేయడంతో ఈ సభ కోసం 100 ఎకరాలకు పైగా ఉండే సభ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఏర్పాట్లతో ఈ సభను పూర్తి సక్సెస్ చేయడం కోసం నారా లోకేష్ చాలా కష్టపడుతున్నారు. ఈ సభకు సుమారు 20 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా.













