వైఎస్ జగన్ కు టీడీపీ ఆహ్వానం
రెండో విడత అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించే నిమిత్తం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వద్దకు మంత్రులను పంపాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిసారి అఖిలపక్ష సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు. ఈసారి సమావేశానికి జగన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఏపీకి కేంద్రం నుంచి రాబట్టాల్సిన సాయంపై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే నిమిత్తం ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. శనివారం ఈ సమావేశం ఉన్నందువల్ల శుక్రవారమే జగన్ను కలిసి ఆహ్వానించాలని నిర్ణయించారు. కాని సీబీఐ కోర్టుకు హాజరయ్యే నిమిత్తం గురువారం మధ్యాహ్నమే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రికి తాను పాదయాత్ర జరుపుతున్న గుంటూరు జిల్లాకు వస్తారని సమాచారం. దీంతో ఆయనను మంత్రులు ఎప్పుడు కలవగలుగుతారన్నది అస్పష్టంగా ఉంది. బీజేపీ, జనసేన పార్టీల ముఖ్యుల వద్దకు కూడా ఎవరినైనా పంపి ఆహ్వానించాలని, లేని పక్షంలో ఫోన్లోనైనా ఆహ్వానం పలకాలని నిర్ణయించారు.













