రఘురామ తనయుడు పిటిషన్‍పై ..సుప్రీంలో

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో ఏపీ సీఐడీ అధికారులు చిత్రహింసలకు గురిచేశారంటూ ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‍పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్‍లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐని ప్రతివాదిగా చేర్చేందుకు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అనుమతి కోరారు. కేంద్ర ప్రభుత్వం మినహా ఏపీ ప్రభుత్వం, ఏపీ డీజీపీ వంటి ప్రతివాదులను జాబితా నుంచి తొలగించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
కస్టడీలో ఉన్న ఎంపీని చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నట్లు తెలిపారు. ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రభుత్వం, జగన్, సీఐడీలను తొలగించారు. ఏపీ ప్రభుత్వాన్ని తొలగించడంపై ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ప్రతివాదుల జాబితాలో మార్పులు చేసేందుకు అనుమతించింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలపాటు వాయిదా వేసింది.