చంద్రబాబుపై రాళ్లదాడి..! ఎన్నెన్నో ట్విస్టులు..!!
తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో రాళ్లదాడి జరిగిందంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ దాడికి సంబంధించి రాళ్లను కూడా అప్పుడే ప్రజలకు చూపించారు. ఇక్కడ రౌడీరాజ్యం నడుస్తోందని.. తమపై రాళ్లతో దాడి చేయిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇక్కడ తమపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని.. అసలిక్కడ పోలీసులు ఎవరూ లేరని ఆరోపించారు. ఈ అంశాన్ని ఇంతటితే వదిలేయకూడదని నిర్ణయించిన భావించిన టీడీపీ.. అటు కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇటు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది.
తిరుపతి ఉపఎన్నిక స్వేచ్ఛగా జరగాలంటే కేంద్ర బలగాలతో పోలింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేసింది. రాళ్లదాడి అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని కోరింది. ఉపఎన్నిక స్వేచ్ఛగా జరగాలంటే వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని సూచించింది. మరోవైపు చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించాలంటూ హోంశాఖకు విజ్ఞప్తి చేశారు పార్టీ ఎంపీలు. రాళ్లదాడి అంశాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లింది. వైసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.
అయితే.. వైసీపీ మాత్రం టీడీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఓటమి భయంతోనే ఇలాంటి డ్రామాలకు తెరలేపారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రాళ్లదాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. ప్రజల్లో సానుభూతికోసమే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రాళ్లదాడి జరగలేదన్నారు. పోలీసులు విచారణ జరిపారని, సీసీ టీవీ ఫుటేజీ కూడా చూశారని.. ఎక్కడా అలాంటి ఆనవాళ్లు కనిపించలేదని స్పష్టం చేశారు.
మరోవైపు రాళ్లదాడికి సంబంధించి ఆధారాలు సమర్పించాలంటూ పోలీసులు తెలుగుదేశానికి నోటీసులు జారీ చేశారు. మీ దగ్గర రాళ్లదాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై విచారణ జరిపిన అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా.. రాళ్లదాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదన్నారు. ఈ అంశంలో పోలీసులపై చేస్తున్న ఆరోపణలు సరికాదని స్పష్టంచేశారు. సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసి అన్ని అంశాలూ పరిశీలించామని.. ఎక్కడా తమకు దాడికి సంబంధించిన ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారులు తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పిస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ.. మధ్య పోలీసులు… మరి ఈ రాళ్లదాడి ఇష్యూ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందనేది వేచి చూడాలి.













