వైసీపీలో ఐప్యాక్ సర్వే గుబులు..! సగం మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో 151 సీట్లలో వైసీపీ గెలుపొందింది. ఈసారి 175 స్థానాలకు గానూ 175 గెలవాలని పార్టీ అధినేత వై.ఎస్.జగన్ కేడర్ కు టార్గెట్ పెట్టారు. గట్టిగా ప్రయత్నిస్తే అన్ని సీట్లలో గెలవడం పెద్ద కష్టమేమీ కాదని దిశానిర్దేశం చేశారు. ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధితో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర రూపురేఖలు మార్చామని వైసీపీ అధిష్టానం చెప్తోంది. ప్రతి ఇంటికీ వెళ్లి తాము చేసిన కార్యక్రమాలను వివరించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు. దీంతో కేడర్ అంతా గడపగడపా తిరుగుతోంది.
మరోవైపు పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తోందో ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఇందుకోసం ఐప్యాక్ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ సీఎం జగన్ కు అందిస్తోంది. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు అందిస్తోంది. తాజాగా ఐప్యాక్ టీం చేసిన సర్వేలో కొంతమంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తేలినట్లు సమాచారం. ఆయా ఎమ్మెల్యేల స్థానంలో పార్టీ అధిష్టానం ఇప్పటికే కొత్త ఇన్ ఛార్జ్ లను నియమించడం ప్రారంభించింది. త్వరలో మరింతమందిని మార్చేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది.
అయితే ఎంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనేది బయటకు రాలేదు. కానీ సుమారు సగం మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సగం మంది ఎమ్మెల్యేలను మార్చడమంటే పెద్ద సాహమే. బహుశా ఆ పని చేయకపోవచ్చు. అందుకే మరీ పూర్తిగా వెనుకబడిన ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. బహుశా ఈ సంఖ్య 20-25 వరకూ ఉండొచ్చని సమాచారం. మిగిలిన ఎమ్మెల్యేలను జనంలో బాగా తిప్పితే వారిపై ఉన్న వ్యతిరేకత తగ్గిపోతుందని.. వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అప్పటికీ వాళ్లలో మార్పు రాకపోతే వాళ్లను తప్పించడం మినహా మరో మార్గం లేదు. ఇదే అంశాన్ని ఆయా ఎమ్మెల్యేలకు వివరిస్తోంది హైకమాండ్.
175 స్థానాలనూ గెలవాలని జగన్ తపిస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం తమకు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని సర్వేలో తేలింది. దీంతో అలా అంటీముట్టనట్లు ఉండే ఎమ్మెల్యేలకు గట్టిగానే హెచ్చరికలు పంపాలని నిర్ణయించారు సీఎం జగన్. ఇప్పటికే మొన్నటి కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు సీఎం. ఇలాగైతే మరోసారి మంత్రి విస్తరణ జరిపాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో మంత్రుల్లో మార్పు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ మీడియా ముందుకు రాని మంత్రులు సైతం ఇప్పుడు రోజూ మీడియా ముందుకొస్తున్నారు. ప్రతిపక్షంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి క్లాసే ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అవసరమనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. పూర్తి వ్యతిరేకత కలిగిన ఎమ్మెల్యేలతో త్వరలోనే పర్సనల్ గా మాట్లాడి గట్టిగానే హెచ్చరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బహశా ఆ తర్వాతైనా మార్పు వస్తుందని భావిస్తున్నారు. మార్పు రాకపోతే మాత్రం వారి స్థానంలో వేరొకరికి సీటు ఖాయంగా కనిపిస్తోంది. మరి చూద్దాం ఎంతమందికి మళ్లీ సీట్లు దక్కుతాయో.. ఎంతమందికి మొండిచేయి చూపుతారో..!!













