మొదటికొచ్చిన హనుమ జన్మస్థల వివాదం!

హనుమాన్ జన్మస్థల వివాదం ముదురు పాకాన పడుతోంది. కర్ణాటకకు చెందిన కిష్కింద హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. టీటీడీ ముందు కుప్పిగంతులు వేస్తోంది. తిరుమల కొండల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని శ్రీరామ నవమి రోజున ఆధారాలతో ప్రకటించింది టీటీడీ.. హనుమంతుడు ఇక్కడి వాడేనని కుండబద్దలు కొట్టింది. దీనికి వ్యతిరేకంగా ఆంజనేయుడు తమవాడేనంటూ కర్ణాటకకు చెందిన కిష్కింద హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాదించడం మొదలుపెట్టింది. దాన్ని తప్పుపడుతూ ఓ లేఖ రాసింది. దానికి కౌంటర్ ఇచ్చింది టీటీడీ. ఈ నెల 20లోగా ఆరోపణలను నిర్ధారించే ఆధారాలు పంపాలని కోరింది. అప్పటి వరకూ ఎందుకు… ఇప్పుడే వచ్చేస్తామంటున్నారు ఆ ట్రస్ట్ సాధువులు.
తిరుమలే హనుమంతుడి జన్మస్థలం అంటూ టీటీడీ చేసిన వాదనకు అభ్యంతరం చెబుతోంది హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. కర్ణాటకలోని తుంగభద్ర తీరంలో ఉన్న కిష్కింద పర్వతమే హనుంతుని జన్మస్థలం అని టీటీడీకి లేఖ రాసింది. టీటీడీ ఆ లేఖకు కౌంటర్ ఇచ్చింది. దానికి అన్ని వివరాలకు జతపరిచింది. ఏవైనా ఆధారాలుంటే వాటితో వస్తే చర్చిద్దామని పేర్కొంది. కరోనా లాక్‌డౌన్ తర్వాత అన్ని ఆధారాలతో వస్తే డిస్కస్ చేసుకుందామని చెప్పింది. అబ్బే అసలు అంత వరకు ఆగేది లేదని, రేపంటే రేపే వచ్చేస్తాం… తాడో పేడో తేల్చేద్దామని కయ్యానికి కాలు దువ్వుతున్నారు ఆ ట్రస్ట్‌కు చెందిన సాధువులతో పాటు ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి.
ఈ వివాదాన్ని రూపుమాపేందుకు టీటీడీ అన్ని ఆధారాలతో అంజనాద్రినే జన్మస్థలంగా చూపించినా.. హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మాత్రం దానిని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఆంజనేయుని జన్మస్థలంపై ఆధారాలతో ప్రకటించడం టీటీడీ చరిత్రలో తొలిసారి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరినీ ఆక్షేపించకుండా మంచి భాషతో ఈ విషయాన్ని ప్రకటించాం.
హనుమంతుడి జన్మస్థలంపై మేము చేసిన కృషిని ప్రశంసిస్తూ దేశవ్యాప్తంగా భక్తుల నుంచి ప్రశంసలు అందాయని హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు రాసిన లేఖలో తెలిపింది టీటీడీ. హనుమంతుని జన్మస్థలంపై క్లారిటీ ఇవ్వడంతో పాటు హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు రాసిన లేఖపై కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇటీవలే కర్ణాటకలోని రిజిస్టర్ సంస్థ అయిన హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు రాసిన లేఖ తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. పండితులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచిన విషయాలు ఎలా నిరాధారమో? ఈనెల 20 లోపు ఆధారాలతో నిరూపించాలని, ఆ లోపు నివేదిక సమర్పిస్తే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మిమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తామని తెలిపింది. ఈ దైవకార్యాన్ని దూషించినందుకు టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు లేఖ రాసింది. కమిటీ సేకరించిన వివరాలను జతచేసింది టీటీడీ.
దీనిపై స్పందించిన కిష్కింద ట్రస్ట్… కరోనా లాక్‌డౌన్ ఉన్నా వెంటనే వచ్చి తేల్చకుంటామంటోంది. తక్షణమే ఇందుకు ఏర్పాట్లు చేయాలంది. జన్మభూమి అంశంపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని ప్రకటించింది ట్రస్ట్. తమకు సమయం అవసరం లేదని, డిస్కషన్‌కు రేపు రమ్మన్నా వస్తామన్నారు ట్రస్ట్ సాధపులు. లేఖలతో సమయాన్ని వృథా చేయొద్దని ఓ సలహా కూడా ఇచ్చారు హనుమద్ జన్మభూమి ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి. మరి దీనిపై టీటీడీ ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.