దేశ చరిత్రలో ఇదే మొదటిసారి…

షరతులతో కూడిన బెయిల్‍పై విడుదలైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆంధప్రదేశ్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై పలువురు ప్రముఖులకు లేఖలు రాస్తున్నారు.. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‍కు లేఖ రాసిన ఎంపీ దేశ చరిత్రలో తొలిసారిగా ఒక పార్లమెంట్ సభ్యుడిపై రాజద్రోహం కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 124(ఏ) రద్దు చేయాలన్న డిమాండ్‍కు ఆమ్‍ఆద్మీ పార్టీ ఎంపీలు మద్దతివ్వాలని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‍ను ఆయన కోరారు. పార్లమెంటులో ఈ అంశంపై గళం వినిపించేలా తన పార్టీ ఎంపీలకు సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తనపై ఆంధప్రదేశ్ సీఐడీ విభాగం నమోదు చేసిన కేసు గురించి వివరిస్తూ.. తనను అరెస్టు చేసిన, చిత్రహింసలు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. వివిధ పార్టీల అధినేతలు, రాజకీయ ప్రముఖుల దృష్టికి తన కేసు వివరాలు తీసుకెళ్లి, మద్దతు కూడగట్టే ప్రయత్నంలో రఘురామకృష్ణ రాజు ఢిల్లీ ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు తెలిసింది.