Anil Kumar Yadav: అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్‌కు మరోసారి పోలీస్ నోటీసులు..

వైసీపీ (YCP) మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) మరోసారి నోటీసులు పంపిన పోలీసులు . ఇటీవల కోవూరు (Kovur) ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి (Prasanthi Reddy)పై జరిగిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనపై నేరం నమోదు కావడంతో ఈ కేసు చుట్టూ ఉద్రిక్తత పెరుగుతోంది. మునుపు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి (Prasanna Kumar Reddy) ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (A1) గుర్తించబడగా, అనిల్ కుమార్‌ను రెండో నిందితుడిగా (A2) పోలీసులు చేర్చారు.
ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో, ప్రసన్నకుమార్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా, కోర్టు విచారణ కోసం హాజరుకావాలని సూచించింది. మరోవైపు, అనిల్ కుమార్ యాదవ్ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పట్లో పోలీసులు జులై 23న ఆయన కు ఈ కేసు విషయం పై నోటీసులు జారీ చేశారు. అయితే అందుబాటులో లేకపోవడంతో ఈ నోటీసులను ఇంటి గోడకు అంటించారు. విచారణ జూలై 26న జరగాల్సి ఉండగా, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందన్న కారణంతో అనిల్ హాజరుకాలేదు. తాజాగా కోవూరు పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. ఈసారి ఆగస్టు 4న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అనిల్ హైకోర్టులో వేసిన పిటిషన్ విషయమై నిర్ణయం ఇంకా రాకపోవడంతో, ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
ఇక, ఈ కేసు వెనుక మరొక పెద్ద అంశం బయటపడుతోంది. మైనింగ్ అక్రమాలపై కొనసాగుతున్న దర్యాప్తులో ఇప్పటికే మరో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy)ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అనిల్ కుమార్‌కు అత్యంత సమీపంగా ఉన్న బొల్లినేని శ్రీకాంత్ రెడ్డి (Bollineni Sreekanth Reddy)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీకాంత్, అనిల్ కుమార్ పేరు వెల్లడించాడని సమాచారం. అందువల్ల మైనింగ్ కేసులోనూ అనిల్ అరెస్టు అయ్యే అవకాశం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక నెల్లూరులో (Nellore) రాజకీయ వేడి మరింత పెరగనుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణిని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) త్వరలో నెల్లూరుకి రాబోతున్నారు ఈ నేపధ్యంలో అనిల్ కుమార్ అరెస్టు అనివార్యమా? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.