Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న .. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో (Ippatam) పర్యటించారు. వైసీపీ (YCP) హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేరానే ఆరోపణలున్నాయి. అప్పట్లో పవన్ కల్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మల్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ (Nageswaramma) అనే వృద్ధురాలు ఆయన్ను కోరింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇచ్చిన మాట మేరకు ఇప్పటం చేరుకున్న పవన్, నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆయనకు వృద్ధురాలు స్వాగతం పలికారు. ఆమెను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు రూ.50 వేల నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి లక్ష రూపాయలను డిప్యూటీ సీఎం అందజేశారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి రూ.5 వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని హామీ ఇచ్చారు.






