అనంత జిల్లా నుంచే పోటీ చేస్తా
రాబోయే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ జిల్లా నుంచే పోటీ చేస్తానన్నారు. ఆ జిల్లాలో జరిగిన జనసేన శిబిరంలో పాల్గొన్నవాళ్లందరినీ కలిసేందుకు కొద్ది రోజుల్లో అనంతపురం వెళ్తానని తెలిపారు. అక్కడ పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీ కోసం వక్తలు, విశ్లేషకులు, కంటెంట్ రచయితలుగా సేవలందించేందుకు అనంతపురం జిల్లా నుంచి వచ్చిన కొత్త నాయకుల్ని పవన్‌కల్యాణ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు. సుమార్ 150 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ ప్రాంతాల్లోని సమస్యల్ని వారు వివరించారు. తుది శ్వాస వరకూ తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని పవన్ తెలిపారు. తనను కొందరు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదని విమర్శిస్తున్నారనీ, అసలు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఎవరున్నారో తెలియజేయాలని ప్రశ్నించారు. ఒక్కో నాయకుడు వేల కోట్ల రూపాయలు రాజకీయా ద్వారా ఆర్జించి ఇంట్లో కూర్చొన్నారని విమర్శించారు. తాను మాత్రం కుటుంబం కోసం, తన మీద ఆధారపడ్డ సిబ్బంది కోసం మాత్రమే సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం సినిమాల్లో నటించడం వాయిదా వేసుకొంటానని ప్రకటించారు.













