పాలిటిక్స్ కు ‘వకీల్ సాబ్’ లాజిక్!
రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. భారీ ఖర్చుతో కూడుకున్న పని. తన వెనుక ఉండే మందీమార్బలాన్ని నిత్యం కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజూ భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలన్నా వెంట వాహనాలు, మనుషులు ఉండాల్సిందే. ఏదైనా కార్యక్రమం చేపట్టాలంటే లక్షలు కావాల్సిందే. ఇక బహిరంగసభ లాంటి పెద్ద సభలు నిర్వహించాలంటే ఖర్చు ఊహించనంత ఉంటుంది. ఇది ఒకరోజులో అయిపోయేది కాదు. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తుంటాయి. అప్పటివరకూ కేడర్ ను కాపాడుకుంటూనే ఉండాలి. అందుకోసమే రాజకీయ నేతలు, పార్టీల ఖర్చు భారీగా పెరిగిపోయింది.
మరి ఇంతటి ఖర్చు రాజకీయ నేతలు ఎలా పెడ్తున్నారు..? ఉదాహరణకు ఎమ్మెల్యేగా గెలిచారనుకుంటే నెలకు 2లక్షల రూపాయల జీతం ఉంటుందనుకున్నాం.. సంవత్సరానికి 24లక్షలు. మరి ఈ 24 లక్షలతో ఏడాది పొడవునా తన మందీమార్బలాన్ని మోయడం సాధ్యమేనా? అస్సలు సాధ్యం కాదు. అందుకే రాజకీయ నేతలందరికీ ఏవో ఇతరత్రా వ్యాపారాలు, వ్యాపకాలు ఉంటాయి. కొంతమందికి పరిశ్రమలుంటాయి.. కొంతమందికి విద్యాసంస్థలు ఉంటాయి.. ఇంకొంతమంది రవాణా రంగం, ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు.. ఇలా ఏవేవో బిజినెస్ లు చేస్తుంటారు. అలా వచ్చిన ఆదాయాన్ని రాజకీయాల కోసం కూడా ఉపయోగిస్తుంటారు. లేకుంటే కేవలం పదవుల ద్వారా వచ్చే జీతంతో రాజకీయం చేయడం అసాధ్యం.
ఈ మధ్య పవన్ కల్యాణ్ తిరుపతిలో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ఆ సభలో పవన్ చేసిన కామెంట్స్ సర్వత్రా ఆసక్తి రేపాయి. రాజకీయాల్లోకి వచ్చే ముందు తాను ఇకపై సినిమాలు చేయనన్నారు పవన్. అయితే ఎన్నికలు ముగిసాయి. ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో పార్టీ నిర్వహణ కష్టంగా మారింది. దీంతో తాను మళ్లీ సినిమాలు చేయక తప్పట్లేదన్నారు. పార్టీని నడపడానికి తనకు తెలిసిన ఏకైక పని సినిమాలు చేయడమేనన్నారు. తాను సినిమాల్లో సంపాదించిన సొమ్మును కూడా రాజకీయాలకే ఖర్చు పెట్టానన్నారు. ఇక్కడే పవన్ కల్యాణ్ ఇంకో అంశాన్ని లేవనెత్తారు.
కొంతమంది నేతలు సిమెంటు ఫ్యాక్టరీలు నడుపుతూ రాజకీయం చేస్తున్నారు. కొంతమంది పాల ఫ్యాక్టరీలతో పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది పేకాట క్లబ్పులు నిర్వహిస్తూ రాజకీయాల్లో ఉంటున్నారు. అంటే వీళ్లందరికీ ఏదో వ్యాపారం ఉంది. అలాంటిది తాను సినిమాలు చేస్తూ రాజకీయం చేస్తే తప్పేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ ఇదే అంశాన్ని మరోసారి లేవనెత్తారు. రాజకీయ నేతలందరికీ ఏవో ఇతరత్రా వ్యాపారాలు ఉన్నప్పుడు తాను సంపాదన కోసం సినిమాలు చేస్తే తప్పేంటనేది ఆయన ప్రశ్న. ఈ వకీల్ సాబ్ లాజిక్ నిజమే కదా అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు..!













