ఎన్నికల్లో పొత్తులు గ్యారంటీ.. సీఎం పదవి టార్గెట్ కాదు: పవన్ కల్యాణ్
వచ్చే ఎన్నికల్లో ఏపీలో కచ్చితంగా పొత్తులు ఉంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. మంగళగిరిలో జరిగిన పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. జూన్ నుండి తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన మొదలు పెడతానని చెప్పారు. డిసెంబర్లో ఎన్నికలు రావొచ్చునని అభిప్రాయపడిన ఆయన.. ఏపీ భవిష్యత్తు కోసం అలయెన్స్ తప్పనిసరి అని, పొత్తుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అదే మిగతా పార్టీలు పొత్తు వద్దనుకుంటే తామేం చేయలేమని వెల్లడించారు. తనను సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేసేవారికి ఒకటే చెబుతున్నానన్న పవన్.. జనసేనకు 48 శాతం ఓటింగ్ ఇస్తే, అప్పుడు తనే సీఎం అవుతానని వెల్లడించారు. అంత ఓటింగ్ రాకపోతే సీఎం పదవి ఎలా అడుగుతాం? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఈసారి జరిగే ఎన్నికల్లో త్రిముఖ పోటీలో బలి కావడానికి జనసేన సిద్ధంగా లేదని పవన్ తేల్చిచెప్పారు. అసలు ప్రత్యర్థి ఎవరని ముందుగా గుర్తించాలని, ఆ తర్వాత పదవుల గురించి చర్చిస్తామని అన్నారు. మహిళలకు సరైన రక్షణ ఇవ్వలేని, రోడ్లు వేయలేని, పోలవరం పూర్తి చేయలేని, ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు ఇవ్వలేని వ్యక్తి లేదా పార్టీనే తమ ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. ఆయన వైఫల్యాల రాసుకుంటూ పోతే పెద్ద లిస్ట్ తయారవుతుందని చెప్పారు. తమ వైరి పక్షం వైసీపీనే అని స్పష్టం చేసిన పవన్.. ఏపీని అధోగతి పాలు చేసిన, గూండాయిజాన్ని పెంచి పోషించిన పార్టీ వైసీపీ అని ఆరోపించారు. రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దేవాలయాలను కూల్చేస్తే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.
‘మన టార్గెట్ సీఎం అవడం కాదు. మన మెయిన్ టార్గెట్ వైసీపీని గద్దె దించడమే. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు సీఎం అవుతారని చర్చ ఉంటుంది. నాకు ఎవరి మీద ప్రేమ లేదు. అలాగే ద్వేషం కూడా లేదు. ప్రజలకు ఏం చేయడం లేదనే వైసీపీ మీద కోపంగా ఉంది. అలయెన్స్‌లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు సీఎం అవుతారని అనుకుంటున్నా. ఎవరు సీఎం అనేది ఆ లెక్కలను బట్టే ఉంటుంది. ప్రస్తుతానికైతే వైసీపీని అధికారం నుంచి దించడమే మన ప్రాధాన్యత’ అని పేర్కొన్నారు.













