గుంటూరులో పాస్ పోర్టు సేవాకేంద్రం ప్రారంభం
గుంటూరులోని చంద్రమౌళి నగర్లోగల తపాలా కార్యాలయంలో రీజినల్ పాస్పోర్టు సేవా కేంద్రం ప్రారంభమైంది. దీనిని అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరులో పాస్పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో విదేశాలకు వెళ్లాలంటే ఒక కలగా ఉండేదని, కానీ నేడు ప్రతి గ్రామం నుంచి ఎంతో మంది విదేశాల్లో ఉన్నారన్నారు. గతంలో పాస్పోర్టు పొందడానికి చాలా ఇబ్బందులు ఉండేవన్నారు. నేడు ఆ పరిస్థితి లేకుండా సులభతరమైన పద్దతిలో పాస్పోర్టు పొందడానికి ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్, ఎమ్మెల్సీ రామకృష్ణ, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.













