విశాఖ గడ్డపై కూటమి జెండాల రెపరెపలు
విశాఖ నగర పాలక సంస్థకు జరిగిన స్థాయీ సంఘం ఎన్నికలో ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయం సాధించింది. పదికి పది స్థానాలను దక్కించుకుంది. పక్కా వ్యూహాలు, పటిష్టకార్యాచరణ, అద్భుత నాయకత్వ పటిమతో ఈ విజయం సాధ్యమైందని చెప్పవచ్చు. అదే వైసీపీ వైపు చూస్తే..కార్యాచరణ లేదు. వ్యూహాలు లేవు. బాధ్యతను మీద వేసుకుని ముందుకు నడిపించిన నాథుడు కనిపించలేదు. దీని ఫలితమై స్థాయీసంఘం ఎన్నికల్లో కూటమి ఘనవిజయంగా చెప్పవచ్చు.
ఆగస్టులో రెండు కీలక ఎన్నికలు.. వైసీపీ ఎదుర్కొంటోంది. అందులో స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే మిగిలాయి.అయితే స్థాయి సంఘం ఎన్నికల్లో ఘోర ఓటమి…. వైసీపీ శిబిరాన్ని తీవ్రనిరాశలో ముంచేసింది. మరోవైపు స్థాయి సంఘం ఎన్నికల్లో గెలుపుతో పూర్తి ఆత్మవిశ్వాసంలో కూటమి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది. ఇక దీని కంటే కూడా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అక్కడ కూడా కూటమికి బలం లేదు. కానీ అధికార పార్టీకి తనకు ఉన్న అన్ని అవకాశాలను సొమ్ము చేసుకుంటోంది. అదే సమయంలో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది.
ఈ మొత్తం పరిణామాలు చూస్తూంటే కూటమి దూకుడు తో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. నిజానికి చూస్తే సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీకి ప్రకటించి చాలా రోజులు అయింది. ఆయన దగ్గరుండి స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీ తరఫున వ్యూహ రచన చేస్తే బాగుండేది అని అంటున్నారు. ఎందుకంటే ఈ కార్పోరేటర్లు రేపటి రోజున ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉంటారు.ఈ విజయమే రేపటి విజయానికి సోపానం అవుతుంది. కానీ వైసీపీ పెద్దలు ఎవరూ సరిగ్గా వ్యవహరించలేదు అని అంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం వైసీపీకి మరో భారీ దెబ్బ తప్పదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. స్థాయీ సంఘం ఎన్నికలను ఒక గుణపాఠంగా తీసుకుని వైసీపీ అంతా పటిష్టమైన వ్యూహాలకు పదును పెట్టాలని కోరుతున్నారు. ముందుగా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులలో విశ్వాసం కలిగించాలని సూచిస్తున్నారు.. అవతల వైపు కూటమి అన్ని రకాలైన అస్త్రశస్త్రాలతో ఎదురు నిలిచి ఉన్న వేళ వైసీపీ సర్వసన్నద్ధంగా తయారు కాకపోతే మాత్రం ఈ నెల 30న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇబ్బందులు వచ్చినా రావచ్చని హెచ్చరికలు ఆపార్టీలోనే వినిపిస్తున్నాయి.













