Minister Narayana : రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ ముందుకొచ్చింది : మంత్రి నారాయణ
సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందాలను గత ప్రభుత్వం రద్దు చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) విమర్శించారు. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మున్సిపల్ కమిషనర్లు, అధికారులకు వర్క్‌షాప్ (Workshop) నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తిరిగి సంబంధాల పునరుద్ధరించేందుకే ఆ దేశం వెళ్లామన్నారు. సింగపూర్ ప్రభుత్వం (Singapore Government) రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు ముందుకు వచ్చిందన్నారు. రాష్ట్రంలో 7 వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్టోబర్ 2 నాటికి 85 లక్షల టన్నుల వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేస్తామన్నారు. కలుషిత నీటి శుద్ధికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రానికి స్వచ్ఛభారత్ (swachh bharat) లో ఐదు అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. అవార్డులు సాధించిన అధికారులకు అభినందనలు తెలిపారు.







