కూటమి కాన్సెప్ట్ కి కనెక్ట్ కాలేకపోతున్న నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ..
ఏపీ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా తమ సత్తా చాటాలి అని భావించిన తెలుగుదేశం- జనసేన కూటమిగా ఏర్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకటే జెండా ఒకటే ఎజెండా అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. రీసెంట్గా జెండా అంటూ ఉమ్మడి బహిరంగ సభను కూడా నిర్వహించి తమ మధ్య ఉన్న సఖ్యతను చాటుకున్నారు. అయితే పార్టీని నడిపించే వారిలో ఉన్న సఖ్యత పార్టీ వెనక నడిచే వారిలో కనిపించడం లేదు. ప్రస్తుతం నెల్లూరులో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిసి అడుగులు వేయడానికి టీడీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ సముఖత చూపడం లేదు అన్న టాక్ జోరుగా నడుస్తోంది. మరీ ముఖ్యంగా ప్రచారానికి వెళ్తున్నప్పుడు కేవలం టీడీపీ జెండాలు మాత్రమే కనిపిస్తున్నాయి అన్న విమర్శ కూడా నారాయణ విషయంలో వినిపిస్తోంది. పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ సీట్ తమ పార్టీకి వస్తుంది అని జనసైనికులు బలంగా నమ్మారు. మరీ ముఖ్యంగా జనసేన పార్టీని నమ్ముకొని ఉన్న మనుక్రాంత్ రెడ్డి ఈసారి సీటు తనదే అని భావించాడు. అయితే నారాయణకు తప్ప ఇంకొకరికి ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పడంతో జనసైనికులు బాగా హర్ట్ అయ్యారు. ఇప్పుడు దానికి తగినట్టుగా నారాయణ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులతో అంటి ముట్టనట్లుగా ఉండడం వారిని మరింత దిగులుకి గురిచేస్తోందని తెలుస్తోంది. ఇదే కొనసాగితే రేపు ఓటింగ్ అప్పుడు జనసైనికులు నారాయణకు ఎంతవరకు మద్దతు ఇస్తారు అన్న విషయం ప్రశ్నార్థకంగా మారుతుంది.













