భీమిలి నుంచి మంత్రి లోకేష్ పోటీ?
రానున్న ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ విశాఖపట్టణంలోని భీమిలి నుంచి శాసనసభకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ఈసారి శాసనసభ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. లోకేష్‌ను కుప్పం నుంచి బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నప్పటికీ లోకేష్ మాత్రం భీమిలివైపు మొగ్గు చూపుతున్నట్టు సమచారం. ఉత్తరాంధ్రపై పార్టీకి తొలి నుంచి గట్టి పట్టు ఉండడంతో లోకేష్ కోస్తా నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. భీమిలి నుంచి లోకేష్ పోటీకి దిగడం వల్ల అక్కడి మూడు జిల్లాలపైనా ఆ ప్రభావం పడుతుందని టీడీపీ అధిష్ఠానం కూడా భావిస్తోంది. లోకేష్ భీమిలి నుంచి బరిలోకి దిగడం పక్కా అయితే, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్టణం ఉత్తరం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.













