ఇక లోకేష్ చేతికి పగ్గాలు…?
టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేశారు. జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికల పొత్తులో భాగంగా సుదీర్ఘ ప్రచారం సైతం నిర్వహించారు. వయసు మీద పడినా కూడా యువకుడిలా ప్రచార పర్వాన్ని నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్.. ఎండలకు ఇబ్బంది పడినా చంద్రబాబు మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. క్యాడర్ లో హుషారు పెంచారు. అరెస్టై 50 రోజులకు పైగా జైల్లో ఉన్నా కూడా గోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాకయ్యారు. ఇప్పుడు అధికారంలోకి వస్తామన్న విశ్వాసంతోనూ ఉన్నారు.
కూటమిలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలో వస్తున్నామని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, క్యాడర్ విశ్వాసంతో ఉన్నారు. ఈదశలో టీడీపీలో అధికారమార్పిడి అంశంపైనా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్‌కు ఇవ్వాలంటూ.. స్వరాలు ప్రారంభమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసి.. మరో వారంరోజుల్లో ఫలితం రానున్న నేపథ్యంలో వ్యూహాత్మకమో.. అనూహ్యమో తెలియదు కానీ.. ఇప్పుడు టీడీపీ జాతీయ పగ్గాలను.. నారా లోకేష్‌కు ఇప్పగించాలన్న డిమాండ్లు.. స్వరాలు తెర మీదికి వస్తున్నాయి. కొన్ని రోజుల కిందట.. సీనియర్ నేత బండారు.. కూడా ఇలానే వ్యాఖ్యానించారు. నారా లోకేష్‌ను జాతీయ అధ్యక్షుడిగా చూడాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వారు కూడా.. ఎ న్నికల ప్రచార సమయంలో ఇదే మాట చెప్పుకొచ్చారు.
చంద్రబాబును ఉన్నత పదవిలో చూడాలని ఉందని.. నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇస్తే.. తాము చూడాలని.. ఆయన వెంట నడవాలని కోరుకుంటున్నట్టు నారా లోకేష్ సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ఇటు.. కింజరాపు కుటుంబం.. కళా కుటుంబాలు కూడా. నారా లోకేష్ కోసం చూస్తున్నాయి. కానీ, ఇప్పుడు విజయవాడకు చెందిన కీలక నాయకుడు బుద్ధా వెంకన్న మాత్రం.. నారా లోకేష్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చూడాలని.. దేశం నేతలు కోరుకుంటున్నారని.. ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. జూన్ 4న కూటమి గెలుస్తుదని.. జూన్ 9న చంద్రబాబు అమరావతిలో ఏపీముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని.. అదే రోజు నారా లోకేష్‌కు పగ్గాలు అప్పగించాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. పార్టీ నాయకుడుగా తాను కూడా అదే కోరుకుంటున్నట్టు చెప్పారు.
వాస్తవానికి నాయకుల మాట ఎలా ఉన్నా.. చంద్రబాబు కూడా.. పార్టీ పగ్గాలు నారా లోకేష్‌కు అప్పగించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి గత ఏడాది నిర్వహించిన మహానాడులోనే అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. వచ్చే రెండుమూడేళ్లలో అయినా.. నారా లోకేష్‌కు టీడీపీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.













