Pawan Kalyan: నాగేశ్వరమ్మ – పవన్ కల్యాణ్ ల అపురూప బంధం!
రాజకీయాల్లో మాట ఇచ్చే వారు చాలామంది ఉంటారు, కానీ ఆ మాట కోసం ఏళ్ల తరబడి నిలబడే వారు అరుదు. ఒక సామాన్య మహిళకు, ఒక అగ్ర నాయకుడికి మధ్య చిగురించిన అరుదైన అనుబంధమే.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇప్పటం గ్రామ నివాసి ఇండ్ల నాగేశ్వరమ్మలది. ఈ బంధం వెనుక ఉన్న కథ ఏదో సినిమాను తలపిస్తుంది.
ఈ కథకు పునాది 2022 మార్చి 14న పడింది. జనసేన 9వ ఆవిర్భావ సభ నిర్వహించడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడా స్థలం దొరకకుండా ఆంక్షలు పెట్టింది. ఆ క్లిష్ట సమయంలో ఇప్పటం గ్రామస్థులు సింహాల్లా ముందుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఆశయాలపై నమ్మకంతో తమ వందల ఎకరాల పంట పొలాలను సభ కోసం ఇచ్చారు. ఆ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో పవన్ మనసులో ఇప్పటం ప్రజలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.
సభకు స్థలం ఇచ్చారన్న కక్షతో, 2022 నవంబర్‌లో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించింది. అప్పుడు బయటకు వచ్చిన పేరే ఇండ్ల నాగేశ్వరమ్మ. తన ఇంటి గోడలు కూలుతున్నా ఆమె బెదరలేదు. ఎదిరించి ఇంటి ముందు నిలబడింది. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆనాడు పోలీసుల ఆంక్షలను ధిక్కరించి, కాలినడకన ఇప్పటం చేరుకున్నారు. కన్నీళ్లతో ఉన్న నాగేశ్వరమ్మను పలకరించి, “నువ్వు నాకు అండగా ఉన్నావు.. నీకు నేను తోడుంటాను” అని ఆరోజే ఆమెకు మాట ఇచ్చారు. గెలిచిన తర్వాత మళ్లీ వచ్చి కలుస్తానని మాటిచ్చారు.
సాధారణంగా నాయకులు గెలిచాక పాత పరిచయాలను మర్చిపోతుంటారు. కానీ పవన్ కల్యాణ్ అందుకు భిన్నం. నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి.. నిన్న ఆయన ఉపముఖ్యమంత్రి హోదాలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ గడప తొక్కి ఆమె పక్కన కూర్చుని, ఒక కుటుంబసభ్యుడిలా ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గతంలోనే సాయం చేసినా, ఇప్పుడు మరింత సాయం అందించారు. “ఏ కష్టం వచ్చినా నేనున్నాను” అని ఆమె తల నిమిరి భరోసా ఇచ్చారు.
“2022లో మీరు మాకు స్థలం ఇచ్చి ప్రాణం పోశారు.. మీ వల్లే మేం ఇక్కడ ఉన్నాం” అన్న కృతజ్ఞత పవన్ మాటల్లో ప్రతిధ్వనించింది. రాజకీయాలకు అతీతంగా, ఒక పేద మహిళ పట్ల నాయకుడికి ఉన్న బాధ్యత ఈ బంధాన్ని ఎలివేట్ చేసింది. నాగేశ్వరమ్మ పవన్‌ను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఇంటి మనిషిగా చూడటం.. పవన్ కూడా ఆమెను ఒక సొంత కుటుంబసభ్యురాలిలా గౌరవించడం అందరినీ ఆకట్టుకుంది.
నాడు సభ కోసం స్థలమిచ్చి పవన్‌ను గుండెల్లో పెట్టుకున్న ఇప్పటం ప్రజలకు, నేడు అధికారం వచ్చాక వారి ఇంటికి వెళ్లి రుణం తీర్చుకున్న పవన్ కల్యాణ్‌కు మధ్య ఉన్న ఈ అనుబంధం.. రాజకీయాల్లో ఒక అరుదైన ఉదాహరణ. ఇప్పటం మట్టి సాక్షిగా మొదలైన ఆ పోరాటం.. నేడు ఒక అపురూపమైన బంధంగా చరిత్రలో నిలిచిపోతుంది.






