తిరుపతికి జియో
భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ సంస్థ నవ్యాంధ్రకు జై కొట్టింది. రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అమరాతికి వచ్చారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) సెంటర్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి ముఖేష్ అంబానీకి చంద్రబాబు వివరించారు. పరిశ్రమల స్థాపనకు తాము ఇస్తున్న ప్రోత్సాహకాలను చెప్పి, నూతన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని ముఖేష్ ప్రకటించారు.
తిరుపతిలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ పార్కు, ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఇందులో ఏటా కోటి జియో సెల్ఫోన్లు తయారు చేస్తాం. జియో ఫోన్లు, చిప్ డిజైన్, బ్యాటరీలు, సెట్‌టాప్ బాక్స్‌ల వంటివన్నీ ఈ ఎలక్ట్రానిక్స్ పార్కులో తయారు చేస్తాం అని ముఖేశ్ ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీలో విద్యార్థులకు ఇందులోనే శిక్షణ కూడా ఇస్తామన్నారు. మరోవైపు అమరావతిలో 50 ఎకరాల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికాం, ఐటీ సార్టప్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ముఖేశ్ అంగీకరించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో 150 మెగావాట్లు సోలార్ ప్లాంట్, డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అమరావతిని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ సహకారం ఉంటుంది అని తెలిపారు. మంత్రి లోకేష్‌తో పాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.













