అధికారంలో వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామన్నారు… కానీ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని మాటా ఇచ్చారని యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి జవహర్ సీపీఎస్ రద్దు విషయంలో టీడీఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ళు ఎమ్మెల్యే, మంత్రిగా ఉండి మీరు ఏం చేశారని నిలదీశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా శాసనమండలిలో అనేక పోరాటాలు చేశామన్నారు. చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తున్న తమను ప్రోత్సహించాలే కానీ విమర్శలు చేయడం తగదన్నారు. మీకు చేతనైతే మీ పార్టీ ద్వారానో వేరే సంఘాల ద్వారా ర్యాలీలు నిరసనలు చేసి సహకరించండి అని తెలిపారు. జగన్ మాటలను నమ్మి ఉద్యోగులంతా గంపగుత్తగా ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించారని తెలిపారు. కానీ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వెంటనే తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.













