Parthasarathi : దేశంలోనే నాలుగో స్థానంలో సీఎం చంద్రబాబు
దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Parthasarathi) అభినందనలు తెలిపారు. ఇండియాటుడే సర్వే (IndiaToday Survey ) లో చంద్రబాబు (Chandrababu) నాలుగో స్థానంలో నిలవడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకోవడం సంక్షేమం కోసం ఆయన పడుతున్న శ్రమ, పట్టుదలతో పనిచేస్తున్న తీరుకు నిదర్శనమన్నారు. కొద్ది నెలల్లోనే రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులను సాధించడం ప్రజలకు, పెట్టుబడి దారులకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.
ఐదేళ్లపాటు అన్ని రంగాల్లో విధ్వంసాన్ని చవిచూసిన రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పట్ట లెక్కించేందుకు ముఖ్యమంత్రి నిరంతరం శ్రమించడం అందరికి మార్గదర్శకమని తెలిపారు. ప్రజలకు వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ (Super Six) పథకాలు అమలు చేయటానికి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం ముందుండి నడిపిస్తున్నారన్నారు. సీఎం మార్గదర్శకత్వంలో తాము కూడా అన్ని విధాలుగా కష్టపడుతున్నామని తెలిపారు. ఎన్నికల హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆశయాన్ని ప్రభుత్వం త్వరలోనే చేరుకుంటుందని తెలిపారు.













