మాగోక్ సైన్స్ పార్కును సందర్శించిన మంత్రి నారా లోకేష్
భవిష్యత్ సాంకేతికతలకు అద్దం పడుతోందని లోకేష్ ప్రశంస
సియోల్ (సౌత్ కొరియా): సియోల్ నగరంలో ప్రధాన పరిశోధన&అభివృద్ధి (R&D), ఆవిష్కరణల కేంద్రమైన ప్రతిష్టాత్మక మాగోక్ (MAGOK) సైన్స్ పార్క్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సియోల్ గాంగ్సియో-గు (Gangseo-gu) ప్రాంతంలో 1 మిలియన్ చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు దక్షిణ కొరియాలోనే అతిపెద్ద సాంకేతిక అనుసంధాన ప్రాంతంగా ఉంది. ఇక్కడ భారీ పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్‌లు, సియోల్ బొటానిక్ పార్క్, టడావో ఆండో రూపొందించిన LG ఆర్ట్ సెంటర్ వంటివి ఉన్నాయి. 8 ఎల్జీ అనుబంధ సంస్థల నుండి సుమారు 20,000 మంది పరిశోధకులు, భాగస్వామ్య సంస్థలు, స్టార్టప్‌లు ఇక్కడ కొలువై ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కార్పోరేట్ పరిశోధనా క్యాంపస్‌లలో ఈ పార్క్ ఒకటిగా ఉంది. మాగోక్ సైన్స్ పార్క్ ను “కొరియా సిలికాన్ వ్యాలీ” అని పిలుస్తారు.
ఎల్జీ ఇన్నోవేషన్ గ్యాలరీ (ఐఎస్సీ, 3వ అంతస్తు)లో రోబోట్ జోన్, ఓఎల్ఈడీ డిస్ప్లే జోన్, మొబిలిటీ, మెటీరియల్స్ ప్రదర్శనలను మంత్రి లోకేష్ తిలకించారు. (ఇక్కడ ప్రస్తుతం ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉంది, ప్రజలకు ప్రవేశం ప్రస్తుతానికి లేదు). ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ సెంటర్ (ఐఎస్సీ) ముదురు రంగులతో కూడిన వాస్తుశిల్ప కేంద్రం, ఇది లీడ్ ప్లాటినం ల్యాండ్‌మార్క్ గా ఉంది. ఎల్జీ ఆర్ట్ సెంటర్ & ఎల్జీ డిస్కవరీ ల్యాబ్ సమకాలీన ప్రదర్శనలు ప్రత్యక్ష సైన్స్ అనుభవాలను కలిగిస్తున్నాయని అన్నారు. ఇక్కడకు సమీపంలోని సియోల్ బొటానిక్ పార్క్, మాగోక్ కల్చరల్ హాల్, హాన్ నది పార్క్ లను కూడా మంత్రి లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…కొరియా భవిష్యత్ టెక్నాలజీని ఒకే చోట చూడటం తనకు సరికొత్త అనుభూతిని కలిగించిందని తెలిపారు. ఓఎల్ఈడీ, రోబోటిక్స్, బ్యాటరీలు, మెటీరియల్స్, బయోటెక్, ఫ్యూచర్ టెక్ గ్యాలరీలు అన్నీ పక్కపక్కనే ఉండటం కొరియా భవిష్యత్ తరం సాంకేతికతకు అద్దం పట్టిందని మంత్రి లోకేష్ కొనియాడారు.
ఎల్ జీ గ్రూప్ ఆధ్వర్యాన సుమారు $4 బిలియన్ డాలర్ల వ్యయంతో 6వేలమంది కార్మికులు 33నెలలపాటు నిర్మించిన ఈ పార్కును 2018లో ప్రారంభించారు. మాగోక్ సైన్స్ పార్కు మాస్టర్‌ప్లాన్, ఆర్కిటెక్చర్‌ను గ్లోబల్ సంస్థ HOK రూపొందించగా, కొరియన్ ఆర్కిటెక్ట్ లు గాన్సామ్, చాంగ్-జో ల పర్యవేక్షణలో దీనిని నిర్మించారు. పరిశోధకులకు సాధికారత కల్పించడం, సమ్మిళిత సమన్వయాన్ని ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్త ప్రతిభను ఆకర్షించడం, స్టార్టప్‌లతో కలిసి ఎదగడం, సుస్థిరంగా ఆవిష్కరణలు చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఎల్ జీ సంస్థ ఈ పార్కు నిర్మాణం చేపట్టింది. డిస్ప్లేలు, ఏఐ & రోబోటిక్స్, బ్యాటరీలు/ఈఎస్ఎస్, బయో, మెటీరియల్స్, గ్రీన్-క్యాంపస్ టెక్ లపై ఇక్కడ ఆవిష్కరణలు జరిగాయి. పారదర్శకమైన రోలబుల్ ఓఎల్ఈడీ స్క్రీన్లు, ప్రపంచంలోనే అగ్రగామి ఈవీ బ్యాటరీ సెల్లు, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, రెడ్, గ్రీన్ బయోటెక్ వంటి ప్రత్యేకతలు ఈ పార్కులో ఉన్నాయి. గ్రీన్ ఇంజనీరింగ్ ద్వారా నీటిపారుదల కోసం 100% వర్షపు నీరు, సోలార్ రూఫ్‌లు, గ్రౌండ్-సోర్స్ హీట్ పంపులు, ఐస్-స్టోరేజ్ కూలింగ్ పరికరాలను వాడటం ద్వారా విద్యుత్ వినియోగాన్ని 88% ఐఎస్సి / ల్యాబ్‌లలో 50% వరకు తగ్గించారు.








