సెయింట్ పీటర్స్ బర్గ్ లో గ్లోబల్ లాజిస్టిక్స్ పై సదస్సులో మంత్రి నారా లోకేష్
ఆర్కిటిక్ జలరవాణా మార్గంతో ఎన్నో ప్రయోజనాలు
ఇంధనం, ఖర్చులు తగ్గి ఆదా పెరుగుతుంది
ఆసియా, ఐరోపాల మధ్య దూరం 40 శాతం తగ్గుతుంది
ఈ మార్గం ద్వారా ఎరువుల రవాణా ఏపీకి ప్రయోజనకరం
సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): సూయజ్ కాలువతో పోలిస్తే ఆర్కిటిక్ ఉత్తర సముద్ర మార్గం ఆసియా, ఐరోపాల మధ్య దూరాన్ని దాదాపు 40 శాతం తగ్గిస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుందని, ఇంధనం-ఖర్చులు తగ్గి, భారత దేశానికి ఆదా అవుతుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గ్లోబల్ లాజిస్టిక్స్ లో కొత్త అవకాశాలు – ఆర్కిటిక్ లో లాజిస్టిక్స్ రూపురేఖలు (New Horizons of Global Logistics and Logistics Contour of the Arctic) అనే అంశంపై సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ మాట్లాడారు.
పొడవైన తీరం..మాకు వరం
నేను భారతదేశంలోని తూర్పుతీరం నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ లో 1053 కి.మీ.లకు పైగా సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. మా రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఓడరేవుల్లో సముద్రరవాణా కార్యకలాపాలు కొనసాగుతుండగా మరో 4 ప్రధాన ఓడరేవులు నిర్మాణంలో ఉన్నాయి. భౌగోళికంగా సముద్రతీర రాష్ట్రంగా ఉన్న ఏపీ ఇప్పటికే ప్రపంచంతో అనుసంధానమై మారిటైమ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మాకు ఆర్కిటిక్ చాలా ముఖ్యమైనది. బంగాళాఖాతం తీరంలోని ఒక రాష్ట్రానికి, ఆర్కిటిక్ గుండా వెళ్లే నౌకా మార్గానికి ఏం సంబంధం అనే ప్రశ్న మీలో ఉదయించవచ్చు. అందుకు సమాధానం వ్లాడివోస్టాక్. వ్లాడివోస్టాక్ ఉత్తర సముద్ర మార్గానికి తూర్పు కొన. ఇది, గత సంవత్సరం ప్రారంభమైన చెన్నై–వ్లాడివోస్టాక్ సముద్ర కారిడార్ ద్వారా, భారతదేశ తూర్పు తీరానికి నేరుగా అనుసంధానమైంది. విశాఖపట్నంతోపాటు మా తీరప్రాంతంలోని ఇతర ఓడరేవుల నుండి ఓడలు ఇప్పటికే 24 రోజుల పాటు వ్లాడివోస్టాక్‌కు ప్రయాణిస్తున్నాయి. వ్లాడివోస్టాక్ నుండి, ఆర్కిటిక్ కారిడార్ పశ్చిమం వైపుగా ఐరోపా వరకు మార్గం తెరిచి ఉంటుంది. ఇది భారతదేశ తూర్పు తీరాన్ని, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ను ఈ మొత్తం వ్యవస్థలోకి సహజమైన దక్షిణ ప్రవేశ ద్వారంగా చేస్తుంది.
ఎరువుల రవాణాకు ఎంతో ఉపయోగకరం
వ్యవసాయం ప్రధాన జీవనాధారమైన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఎరువులను వినియోగిస్తాయి. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల ఉత్పత్తిదారుల్లో ఒకటి. ఇప్పుడు ఆ ఎరువులు బాల్టిక్ సముద్రం గుండా సూయజ్ మీదుగా, హిందూ మహాసముద్రాన్ని దాటి, మా ఓడరేవులకు ఒక సుదీర్ఘమైన, ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తాయి. ఇది ఎక్కువ సమయం తీసుకోవడంతోపాటు అంతరాయాలకు గురయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు అదే ఎరువులు రష్యాలోని ఆర్కిటిక్ ఓడరేవులో లోడ్ అయ్యి, ఉత్తర సముద్ర మార్గం గుండా తూర్పుగా వ్లాడివోస్టాక్‌కు, ఆపై జపాన్ సముద్ర మార్గం నుంచి బంగాళాఖాతం గుండా దక్షిణంగా విశాఖపట్నానికి ప్రయాణిస్తే సమయం ఆదా కావడంతోపాటు దూరం తగ్గుతుంది. అంతరాయాలు కూడా తక్కువగా ఉంటాయి. ఎరువులతోపాటు ముడి చమురు, ఎల్ఎన్ జీ , కీలక ఖనిజాలు…అన్నింటి రవాణా ఖర్చులు తగ్గి, కాలం కలిసి వస్తుంది. ఉత్తర సముద్ర మార్గం ప్రస్తుతం సంవత్సరంలో సుమారు నాలుగు నుండి ఐదు నెలల పాటు మాత్రమే పూర్తిగా తెరిచి ఉంటుంది. శీతాకాలంలో ఈ మార్గంలో రవాణా చాలా కఠినంగా ఉంటుంది. ఐస్‌బ్రేకర్ మద్దతు అవసరం, ఖర్చులు పెరుగుతాయి, ఆ నెలల్లో సరుకు రవాణా ఆర్థికంగా లాభదాయకం కాదు. కానీ ప్రయాణ దిశ స్పష్టంగా ఉంది. రష్యా తన ఐస్‌బ్రేకర్ నౌకాదళాన్ని విస్తరిస్తోంది. ఏడాది పొడవునా నౌకాయానం కోసం ప్రణాళికలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఈ మార్గం సంపూర్ణంగా అందుబాటులోకి వస్తే… దానిని ఉపయోగించుకునేందుకు మాలాంటి తీరప్రాంతాలు ఎదురుచూస్తున్నాయి.
ఇటీవలి సంవత్సరాల్లో ఎర్ర సముద్రం, సూయజ్ కాలువలో జరిగిన అంతరాయాలు, ఒకే కారిడార్‌పై ఆధారపడటం ప్రమాదకరమని ప్రతి వాణిజ్య దేశానికి గుర్తు చేశాయి. ఆర్కిటిక్ మార్గంను వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెడుతోంది. లోతైన నీటి ఓడరేవులు, లాజిస్టిక్స్ పార్కులు, తీరం వెంబడి పారిశ్రామిక క్లస్టర్లు అన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. అందరి సహకారంతో ఈ మార్గంలో అద్భుత అభివృద్ధిలో మేం భాగస్వాములం అవుతాం అని లోకేష్ వివరించారు.








